2 గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకి... జనవరికల్లా ఎక్స్‌ప్రెస్ హైవే

2 గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకి... జనవరికల్లా ఎక్స్‌ప్రెస్ హైవే

జనవరిలో బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే సిద్ధం అవుతుందని, దీని వల్ల ప్రయాణ సమయం 2 గంటలు ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. “మేము 36 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాము. అందులో భాగంగా చెన్నై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తున్నాం. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే ఈ ఏడాది చివరికల్లా పూర్తయి జనవరిలో ప్రారంభం కానుంది అని ఆయన చెప్పారు.

హిందుజాకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అశోక్ లేలాండ్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ.. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆటోమొబైల్ రంగం ప్రపంచంలోనే మూడో అతిపెద్దదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గరిష్టంగా జీఎస్టీని అందజేస్తోందని నితిన్ గడ్కరీ చెప్పారు. లాజిస్టిక్స్ ధరను ప్రస్తుతం 14%-16% నుంచి 9%కి తగ్గించేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఆటోమొబైల్స్‌లో నంబర్ 1గా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.  

శిలాజ ఇంధనాల నుంచీ వచ్చే కాలుష్యాన్ని ఎత్తి చూపుతూ, ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి, మిథనాల్‌తో బస్సులు, ట్రక్కులను నడపడానికి చర్యలను వేగవంతం చేసినట్టు గడ్కరీ ప్రకటించారు. ఎలక్ట్రిక్ హైవేలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గడ్కరీ తెలిపారు. హైడ్రోజన్ భవిష్యత్ ఇంధనం అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.