బెంగళూరుకు క్యూ

బెంగళూరుకు క్యూ
  • కాస్మోపాలిటన్​ నగరంలో సగం మందికిపైగా వలస వాళ్లే
  •  ఉద్యోగాలు, పెళ్లిళ్లతో సెటిలవుతున్న వేరే ప్రాంతపోళ్లు
  • 44.3 లక్షల మంది వలసదారులు.. ‘స్థానిక వలస’లే ఎక్కువ
  • బయటి రాష్ట్రాల జాబితాలో తమిళులు టాప్​
  • 3.6 లక్షల మందితో తెలుగోళ్లు సెకండ్​

ఒక నగరం.. కాంక్రీట్​ జంగిలే కాదు. కొన్ని లక్షల మందికి ఉపాధినిచ్చే ఓ పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో ఎన్నో జాతులు, వర్గాలు కలిసికట్టుగా ఉండే ఓ పెద్ద కుటుంబం. అలాంటి కుటుంబంలో ఇంటోళ్ల కన్నా బయటోళ్లే ఎక్కువగా ఉన్నారంటే నమ్ముతారా? కాస్మోపాలిటన్​ సిటీగా పిలిచే బెంగళూరులో సగానికిపైగా జనం బయటి ఊళ్ల నుంచి వలస వచ్చిన వాళ్లేనంటే నమ్ముతారా? ఆఫీస్​ ఆఫ్​ ద రిజస్ట్రార్​ జనరల్​ అండ్​ సెన్సస్​​ కమిషనర్​ చెబుతున్న లెక్కలు కాబట్టి నమ్మి తీరాల్సిందే. ఆ లెక్కల ప్రకారం 50.6 శాతం మంది వలసదారులే. వలసలపై ఇటీవలే జన గణన కమిషనర్​ నివేదిక విడుదల చేశారు. ఆ లెక్కలే ఇవి.

2011 జనాభా లెక్కల ప్రకారం బెంగళూరు (అర్బన్​, రూరల్​ కలిపి) 96,21,551. ఒక్క అర్బన్​ జనాభానే లెక్కలోకి తీసుకుంటే 87,49,944 మంది ఉన్నారు. అర్బన్​లో ఉంటున్న వాళ్లలోనే సగానికిపైగా వలసదారులున్నారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే 44.3 లక్షల మంది బయటి ప్రాంతాల నుంచి బెంగళూరుకు వచ్చి బతుకుతున్నారన్నమాట. గతంతో పోలిస్తే ఇప్పుడు వలసదారులు బెంగళూరులో రెట్టింపు కన్నా ఎక్కువయ్యారు. 2011కు ముందు చేసిన జనాభా లెక్కల ప్రకారం 65,37,124 మంది బెంగళూరులో ఉంటే, 20.8 లక్షల మంది మాత్రమే వలసదారులు ఉండేవాళ్లు. అప్పటికి జనాభాలో వాళ్ల వాటా కేవలం 31.9 శాతం. ఇప్పుడు బెంగళూరులో ఉన్న మెగ్రెంట్స్​, కర్ణాటక నుంచి బయటకు రాష్ట్రాలకు వెళ్లిన 25 లక్షల మందితో పోలిస్తే 175.8 శాతం ఎక్కువ.

కన్నడిగులే ఎక్కువ

బెంగళూరులో ఉంటున్న వలసదారుల్లో కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ల వాటానే ఎక్కువ. వాళ్లే 64 శాతం మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ల లెక్కను తీసుకుంటే, తమిళనాడు వాళ్ల షేర్​ ఎక్కువగా ఉంటుంది. 5.2 లక్షల మంది తమిళులు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ నుంచి 3.6 లక్షల మంది తెలుగోళ్లు అక్కడ బతుకుతున్నారు. అందులో 34 శాతం మంది ఉద్యోగాల కోసమే అక్కడికి వెళ్లారు. అంటే తమిళనాడు తర్వాత తెలుగోళ్ల వాటానే ఎక్కువన్నమాట. 1.7 లక్షల మంది మలయాళీలు (కేరళ) వాళ్లు ఉన్నారు. ఉత్తరాది కన్నా దక్షిణాది వాళ్లే ఎక్కువగా బెంగళూరు బాట పడుతున్నట్టు జనాభా లెక్కల్లో తేలింది. ఇక, మొత్తం వలసదారుల్లో 3.6 లక్షల మంది ఎస్సీలున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అందులో 19 శాతం మంది ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తే, 16 శాతం మంది ఇక్కడి వాళ్లను పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. పెళ్లి చేసుకుని సెటిలైనవాళ్లలో 92 శాతం మంది మహిళలే. ఇక్కడకు వచ్చిన ఎస్టీలు చాలా తక్కువ. కేవలం 88,405 మంది ఉన్నారు. అందులో 27 శాతం మంది పొట్టచేతబట్టుకుని వచ్చినవాళ్లున్నారు.

ఐటీ హబ్​ కాబట్టే

బెంగళూరును కాస్మోపాలిటన్​ నగరంగా పిలుస్తారు. కారణం, అక్కడ అంతలా పాతుకుపోయిన ఐటీహబ్​. దేశంలో బెంగళూరును ఐటీ రాజధానిగా పిలుస్తుంటారు. అంతేకాదు, ప్రభుత్వ రంగ సంస్థలకూ కొదవే లేదు. అందుకే బెంగళూరుకు ఇతర ప్రాంతాల వారు క్యూ కడుతున్నారు. పని, పెళ్లి ఈ రెండే అక్కడ వలసదారుల పెరుగుదలకు కారణమవుతోంది. పక్కరాష్ట్రాల నుంచి బెంగళూరుకు వరుస కడుతున్నారంటే ఓకే. కానీ, ఉత్తరాది రాష్ట్రాల నుంచీ జనం ఇక్కడికి తరలివస్తున్నారు. తమిళనాడు, ఉమ్మడి ఏపీ, కేరళ తర్వాత రాజస్థాన్​ నుంచే ఎక్కువగా ఇక్కడికి వచ్చారు. 82,468 మంది రాజస్థాన్​ ప్రజలు బెంగళూరుకు వలస వచ్చారు. 2001 జనాభా లెక్కలతో పోలిస్తే ఇప్పుడు వాళ్ల సంఖ్య దాదాపు రెట్టింపైంది. చాలా మంది ఉద్యోగాల కోసమే ఇక్కడికి వచ్చినా, 10 శాతం మంది మాత్రం సొంతంగా వ్యాపారాలు పెట్టుకుని బతుకు బండి లాగేస్తున్నారు. జార్ఖండ్​, త్రిపుర, మణిపూర్​ నుంచి కూడా బెంగళూరుకు వలసలు పెరుగుతున్నాయి. కర్ణాటకలోని మైసూరు, మంగళూరు, హసన్​, ధర్వాడ్​, బళ్లారిలతో పోలిస్తే జనాల చూపు ఎక్కువగా బెంగళూరుపైనే ఉంది.

చిన్న పట్టణాలకూ వలస తాకిడి

బెంగళూరే కాదు, చిన్న పట్టణాలకూ వలస తాకిడి పెరిగింది. గుల్బర్గా, చిత్రదుర్గ వంటి పట్టణాల్లో గతంతో పోలిస్తే వలసదారులు ఎక్కువయ్యారు. 2001, 2011 జనాభా లెక్కలను పరిశీలిస్తే, ఆయా పట్టణాల్లో వరుసగా 18 శాతం, 10 శాతం చొప్పున వలసదారులు పెరిగారు. అయితే, ఆ వలసల్లో ఎక్కువగా ఉన్నది కర్ణాటకలోని ఇతర ప్రాంతాల వాళ్లే. ఉదాహరణకు మైసూరులో 9.2 లక్షల జనాభా ఉన్నారు. అందులో 4.5 లక్షల మంది వలస వచ్చిన వాళ్లే. అందులోనూ 90 శాతం మంది సొంత రాష్ట్రంలోని వాళ్లే. కేవలం 10 శాతం మందే వేరే రాష్ట్రాల నుంచి అక్కడకు వచ్చి బతుకుతున్నారు. బళ్లారిలో 34 శాతం మంది బయటి రాష్ట్రాల వాళ్లు కాగా, మంగళూరులో 29 శాతం మంది ఉన్నారు. బళ్లారిలో అయితే 30 శాతం మంది వలసదారులు తెలుగోళ్లే అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో. దానికీ కారణం లేకపోలేదు. ఎందుకంటే, ఏపీకి అది సరిహద్దు కాబట్టి. మంగళూరుకు వస్తున్న వాళ్లలో 8 శాతం మంది చదువు కోసమే వెళుతున్నారు. 16,726 మంది వేరే ప్రాంతాల స్టూడెంట్లు అక్కడ చదువుకుంటున్నారు. ఆ తర్వాత శివమొగ్గ, చికమగళూరుకు క్యూ కడుతున్నారు. మైసూరులో నంబర్​ ఎక్కువగానే ఉన్నా, మొత్తం వలసదారులతో పోలిస్తే కేవలం 4.6%.