మీ పిల్లలను మా స్కూల్కి పంపకండి

మీ పిల్లలను మా స్కూల్కి పంపకండి
  • పేరేంట్స్​కు బెస్ట్​ అవైలబుల్​ స్కూల్స్​ యాజమాన్యం లెటర్
  • రూ.180 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించట్లేదని వెల్లడి 
  • 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్​ భవిష్యత్తుపై ఆందోళన

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పేరెంట్స్  తమ పిల్లలను బడులకు పంపవద్దని బెస్ట్  అవైలబుల్  స్కూల్స్ (బీఏఎస్) యాజమాన్యం కోరింది. ఈ మేరకు తల్లిదండ్రులకు యాజమాన్యం లేఖ రాసింది. గత రెండేండ్లుగా స్టూడెంట్ల ఫీజులకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, అయినా.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు, ఇతరుల వద్ద అప్పులు చేసి పాఠశాలను నెట్టుకువస్తున్నామని ఆ లేఖలో తెలిపింది. 

‘‘పిల్లలను బడుల్లో చేర్చుకోబోమని ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే చెప్పాం. సంబంధిత ఆఫీసర్లు, రాజకీయ నాయకులు నెలలోపు డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇవ్వగా పిల్లలను పాఠశాలలో చేర్చుకున్నాం. కానీ, ఇప్పటివరకూ ఎలాంటి నిధులు విడుదల కాలేదు. అందువల్ల ఈ నెల 4 నుంచి మీ పిల్లలను పాఠశాలలోకి అనుమతించం’’ అని యాజమాన్యం ఆ లెటర్ లో తెలిపింది. ఆ లెటర్​ చదివిన విద్యార్థులు, పేరేంట్స్​ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

స్టూడెంట్ల భవిష్యత్తును నాశనం చేయడం ఏంది?

రాష్ట్రంలో 238 బెస్ట్  అవైలబుల్  స్కూల్స్ ఉన్నాయి. వాటిలో సుమారు 7 వేల మంది ఎస్టీ, 23 వేల మంది ఎస్సీ విద్యార్థులు చదువుకుంటున్నారు. డే స్కాలర్స్​ స్టూడెంట్స్​కి ఏటా రూ.28 వేలు, రెసిడెన్షియల్  విద్యార్థులకు రూ.42 వేల చొప్పున ఆయా స్కూల్స్​కి ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది.  అయితే 2023–24 నుంచి ఇప్పటివరకూ ఈ  స్కీం కింద చెల్లించాల్సిన స్టూడెంట్స్​ ఫీజులు ప్రభుత్వం చెల్లించలేదని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.180 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ప్రైవేట్​ స్కూల్స్​ యాజమాన్య కమిటీ చెబుతోంది.

 దీనిపై ఇటీవల కమిటీ సభ్యులు మీటింగ్​ పెట్టుకొని  స్టూడెంట్స్​ను పాఠశాలకు అనుమతించకూడదని నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని స్కూల్స్​ తరపున ఒకేసారి పేరేంట్స్​కు లెటర్స్  పంపించాయి. దసరా సెలవులు ముగిసిపోగా సోమవారం నుంచి తమ పిల్లలను స్కూళ్లకు పంపే ముందు వచ్చిన ఈ లెటర్లపై పేరెంట్స్  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.