స్థానిక సంస్థల ఎన్నికలు: జనరల్ స్థానాల్లోనూ సీట్ల కోసం బీసీల పోటీ

స్థానిక సంస్థల ఎన్నికలు: జనరల్ స్థానాల్లోనూ సీట్ల కోసం బీసీల పోటీ

మహబూబ్ నగర్ :  స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో లీడర్లు ఫుల్​జోష్​లో ఉన్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారంతా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా.. జడ్పీటీసీ ఎన్నికల్లో జనరల్​ స్థానాల్లో పోటీ ఎవరు చేయాలనే దానిపై సస్పెన్స్​ నెలకొంది. ఈ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇస్తారా? లేదా ఇతర వర్గాలకు చెందిన లీడర్లకు హైకమాండ్​ అవకాశం కల్పిస్తుందా? అనేది మిలియన్​ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

జనరల్​ స్థానాల్లోనూ సీట్ల కోసం బీసీల పోటీ..

జడ్పీటీసీ స్థానాల్లో జనరల్, జనరల్​ మహిళలకు రిజర్వ్​ అయిన చోట్ల బీసీలు పోటీకి దిగే ఆలోచన చేస్తున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్​ జడ్పీటీసీ స్థానం జనరల్ కు​, రాజాపూర్  జనరల్​ మహిళ, దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట జనరల్​ మహిళ, దేవరకద్ర జనరల్​కు రిజర్వ్​ అయ్యాయి. అయితే ఈ స్థానాల్లో బీసీ వర్గానికి చెందిన లీడర్లు పోటీ చేయాలని చాలా కాలం నుంచి గ్రౌండ్​ వర్క్  చేసుకున్నారు. రిజర్వేషన్లు కూడా వారికి అనుకూలంగా వస్తాయని ఆశించారు. 


కానీ, రిజర్వేషన్లు తారుమారు కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే ఎలాగైనా పోటీకి దిగాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు బాలానగర్​ జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఓ బీసీ లీడర్ ​సన్నద్ధం అయ్యారు. కానీ, ఈ స్థానం నుంచి మండలానికి చెందిన ఇద్దరు బలమైన లీడర్లు పోటీకి దిగాలని భావిస్తున్నారు. అయితే సదరు బీసీ లీడర్​ మాత్రం కాంగ్రెస్​లో తనుకున్న పరిచయాలను వాడుకొని జడ్పీటీసీ టికెట్​ దక్కించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మూసాపేట స్థానం నుంచి పోటీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. 

అయితే ఇతర సామాజిక వర్గానికి చెందిన లీడర్లు కూడా ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ స్థానం నుంచి పోటీకి దాదాపు ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. అలాగే దేవరకద్రలో కాంగ్రెస్​కు చెందిన బీసీ వర్గంలోని ఓ సీనియర్​ లీడర్ రిజర్వేషన్​ అనుకూలంగా వస్తుందని ఆశించాడు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ..  రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్​ పార్టీనే నమ్ముకొని పని చేస్తున్నాడు.


 కానీ, రిజర్వేషన్​ బీసీ కాకుండా జనరల్  రావడంతో నిరుత్సాహంలో ఉన్నాడు. అయితే పార్టీ క్యాడర్​ మాత్రం తన పేరును ప్రపోజ్​ చేస్తుందనే నమ్మకం పెట్టుకున్నాడు. ఇదిలాఉంటే ఇక్కడి నుంచి మరో సామాజిక వర్గానికి చెందిన లీడర్​ను ఇక్కడి నుంచి పోటీకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. 

క్యాడర్​ నుంచి అభిప్రాయ సేకరణ..

జడ్పీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్​ బరిలోకి దిగుతోంది. అత్యధిక స్థానాల్లో పార్టీ లీడర్లను గెలిపించుకోవాలని ఆ పార్టీ క్యాడర్​తో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ఆయా మండలాల్లో జడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఎవరూ అర్హులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్​ లీడర్లు లిస్టులు తయారు చేస్తున్నారు. ప్రతి మండలం నుంచి ముగ్గురు లీడర్ల పేర్లను ఎంపిక చేస్తున్నారు. ఎంపిక చేసిన పేర్లను మండలాల వారీగా క్యాడర్​తో సమావేశమై, క్యాండిడేట్​ పేర్లను ఫైనల్​ చేసే పనిలో పడ్డారు. 

ఇందులో భాగంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ప్రజల్లో బలం ఎలా ఉంది? ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? సదరు క్యాండిడేట్​కు బలమైన ఓటు బ్యాంకు ఉండి, ఆర్థిక బలం లేకున్నా.. పార్టీ నుంచి సపోర్ట్​ చేసే విధంగా హైకమాండ్​కు రిపోర్టులు అందిస్తున్నారు. ఈ నెల 8 లోపు పేర్లను ఫైనల్​ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.