Chiranjeevi: 70వ వసంతంలోకి మెగాస్టార్ చిరంజీవి.. సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్

Chiranjeevi: 70వ వసంతంలోకి మెగాస్టార్ చిరంజీవి.. సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్

కొణిదెల శివశంకర వరప్రసాద్. ఈ పేరుకి కూడా తెలియదేమో! ముందు భవిష్యత్తులో 'చిరంజీవి'గా మార్పు చెందుతుందని. ఎక్కడో.. ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరు అనే పల్లెటూరిలో (1955 ఆగస్టు 22న) జన్మించారు చిరంజీవి. తనదైన నటనతో, అదిరిపోయే స్టెప్పులతో, ఫైట్స్తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. ఏకంగా ప్రపంచం నలుమూలల అభిమానులను సొంతం చేసుకుని సత్తా చాటారు. అయితే, ఒక మాములు మనిషిగా ఇండస్ట్రీకి వచ్చి, సినీ పరిశ్రమలో మెగాస్టార్గా స్థానం సొంతం చేసుకోవడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే ప్రయాణం. అలా ఇప్పుడొచ్చిన సినీ అభిమాన డైరెక్టర్స్, హీరోలకే కాదు.. వచ్చే తరాలకు కూడా ఆదర్శంగా నిలిచారు. ఇవాళ (ఆగస్టు 22న) మెగాస్టార్‌, పద్మ విభూషణ్ చిరంజీవి 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా, ప్రజా జీవితం మరియు దాతృత్వంలో మీ అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. మీ అంకితభావంతో మీరు మరెన్నో జీవితాలను స్పృశించడం కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యం, ఆనందంతో పాటు విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నానని’’ చంద్రబాబు ఆకాంక్షించారు.

చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని పవన్ తెలిపారు. . ‘‘ ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ  పెరగడం ఒక గొప్ప అనుభవం... వెల కట్టలేని జీవిత పాఠం. ఒక సాదాసీదా సాధారణ కుంటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తిప్రతిష్ఠలు సాధించడం నాకే కాదు నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత.

చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు.. కువిమర్శలకు కుంగిపోనూ లేదు. విజయాన్ని వినమ్రతతోనూ.. అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన 'విశ్వంభరుడు'..! పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని’’ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తన ప్రేమను, నోట్ రూపంలో రాసి వ్యక్తపరిచారు.

విక్టరీ వెంకటేష్ బర్త్ డే విషెస్ చెబుతూ.. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్‌ చిరంజీవి. ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నానని’’ వెంకీ తెలిపారు.

‘హ్యాపీ బర్త్‌డే.. వన్‌ అండ్‌ ఓన్లీ మెగాస్టార్‌ చిరంజీవి గారు’ అంటూ అల్లు అర్జున్‌ X వేదికగా విషెష్ తెలిపారు. ఆయనతో కలిసి డ్యాన్స్ చేస్తోన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

చిరంజీవి సినీ ప్రస్థానం:

1978లో “పునాదిరాళ్లు” సినిమాతో చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. కానీ 'ప్రాణం ఖరీదు' సినిమా ముందుగా రిలీజైంది. విలన్ పాత్రలను సైతం కాదనకుండా నటిస్తూ.. మల్టీస్టారర్ చిత్రాలలో కూడా  తళుక్కుమన్నారు.  1980లో చిరంజీవి ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ. కొడుకు రాంచరణ్ తేజ్. అల్లు అరవింద్ చిరంజీవి బావమరిదే . 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన' ఖైదీ' సినిమాతో చిరంజీవికి స్టార్‌డమ్‌ వచ్చింది.అప్పట్లోనే ఈ సినిమా రూ.4 కోట్లకుపైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీంతో చిరంజీవి కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

‘ఖైదీ’సినిమాతో సూపర్ డూపర్ హిట్ కావడంతో అవకాశాలు క్యూ కట్టాయి.  ఆ సినిమా తర్వాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, సంఘర్షణ, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఇంద్ర, స్టాలిన్, శంకర్ దాదా  MBBS,జిందాబాద్,  ఖైదీనెంబర్ 150, ఆచార్య  వరుస విజయాలను అందించాయి. దీంతో చిరు సుప్రీమ్ స్టార్ అయ్యాడు.. విజేత, స్వయంకృషి, రుద్రవీణ వంటి సందేశాత్మక చిత్రాలతో సైతం మెప్పించాడు. రుద్రవీణ చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ సమగ్రతా చిత్రం అవార్డు కూడా వచ్చింది.

ఇప్పటివరకు 155కిపైగా సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి..తాజాగా ఇప్పుడు, విశ్వంభర, అనిల్ రావిపూడి మెగా 157, శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ, డైరెక్టర్ బాబీతో మారియో మూవీ చేస్తున్నారు. ఇందులో మొదటగా అనిల్ రావిపూడి మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత  విశ్వంభర సమ్మర్ లో వస్తుండగా, దసరా బరిలో శ్రీకాంత్ ఓదెల మూవీ నిలిచే అవకాశం ఉంది. విశ్వంభర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.