పెంపుడు జంతువులతోనే మెరుగైన ప్రపంచం

పెంపుడు జంతువులతోనే మెరుగైన ప్రపంచం
  • ఖరీదైన పెట్ డాగ్స్ కంటే వీధి కుక్కలే మేలు: అక్కినేని అమల

హైదరాబాద్: మనుషులకు తోడు నీడగా నిత్యం వెన్నంటి ఉండే జంతువులకు ‘మెరుగైన ప్రపంచం’ సృష్టించేందుకు కట్టుబడి ఉండాలని వీధి జంతువుల సంక్షేమ సంఘాలు పిలుపునిచ్చాయి. వీధిజంతువుల సంక్షేమంపై వస్తున్న ఆందోళనలను పరిష్కరించే అంశాన్ని చర్చించేందుకు పెట్ ఫుడ్ కంపెనీ మార్స్ పెట్  వెబినార్ నిర్వహించింది. దేశంలోని వీధి జంతువుల సంక్షేమం చుట్టూ ఉన్న సమస్యలను పరిష్క రించడం దీని లక్ష్యం.
 బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ చిన్ని కృష్ణ, పీవీఎన్ఆర్ తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (రాజేంద్రనగర్) వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ వి. రవీందర్ రెడ్డి, ఐఏఎస్ అధికారి పరిశ్రమలు, వాణిజ్యం శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తోపాటు బ్లూ క్లాస్ ఆఫ్ హైదరాబాద్ చైర్ పర్సన్ అమలా అక్కినేని, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్, హ్యూమన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎండీ అలోక్ పర్ణ సేన్ గుప్తా,  మార్స్ పెట్ కేర్ జనరల్ మేనేజర్ గణేశ్ రమణి లాంటి వారు ప్యానలిస్టులుగా పాల్గొన్నారు.
పెంపుడు జంతువుల యజమానులు వాటి పట్ల జీవితకాల అనుబంధాన్ని కలిగిఉండేలా వారిలో అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఈ వెబినార్ జరిగింది. పెంపుడు జంతువులను పెంచుకోవాలనుకునే వారు ఖరీదైన డాగ్ బ్రీడ్స్ కు బదులుగా అదే విధమైన ప్రేమ, గౌరవాన్ని ప్రదర్శించే వీధిజంతువులను పెంచుకునేందుకు ముందుకురావడాన్ని ప్రోత్సహించాలని ప్యానలిస్టులు సూచించారు. మూగజంతువులు మనుషుల పట్ల బేషరతు ప్రేమ, సంరక్షణలను ప్రదర్శిస్తాయి, మనం వాటి కోసం మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాల్సి ఉందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేయాలన్నారు. 
బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ చైర్ పర్సన్ అమల అక్కినేని మాట్లాడుతూ 28 ఏళ్లుగా మేం జంతు సంక్షేమం కోసం ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. మా అత్యంత ప్రభావ పూరిత క్యాంపెయిన్ అడాప్షన్ ప్రోగ్రామ్ అని.. అతి ముఖ్యమైన ఈ అంశాన్ని తెర పైకి తీసుకువస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.