స్టాక్​ ట్రేడింగ్​ స్కామ్స్​తో జర జాగ్రత్త!!

స్టాక్​ ట్రేడింగ్​ స్కామ్స్​తో జర జాగ్రత్త!!

తమ సంస్థ ద్వారా స్టాక్​ మార్కెట్లలో ఇన్వెస్ట్​ చేస్తే భారీ లాభాలు ఇస్తామంటూ మోసం చేసే నకిలీ ట్రేడర్ల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్​లోనే  20 కేసులు రిజిస్టర్​ అయ్యాయి. ఇలాంటి వారిపట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్​క్రైం ఎక్స్​పర్టులు చెబుతున్నారు.

హైదరాబాద్​: స్టాక్​మార్కెట్లోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్టుగానే.. ఇన్వెస్టర్లను మోసం చేసే వారి సంఖ్యా పెరుగుతోంది. దాదాపు ప్రతి ఇన్వెస్టర్​కు ఫేక్​ స్టాక్​ మార్కెట్ ​ట్రేడర్ల నుంచి కాల్స్​ వస్తున్నాయి.  సోషల్ మీడియా ప్లాట్‌‌ఫారమ్‌‌ల ద్వారా ఈ మోసగాళ్లు ఇన్వెస్టర్లను సంప్రదిస్తున్నారు. ఇటీవల, ఇండోర్, బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ  నగరాల నుంచి ఇన్వెస్టర్లకు కాల్స్​ వచ్చాయి.

తమ సంస్థలో ఇన్వెస్ట్​ చేస్తే భారీగా లాభాలను సంపాదించవచ్చని ఆశచూపారు. వీరి వలలో పడితే దారుణంగా మోసపోవడం ఖాయం. హైదరాబాద్ కమిషనరేట్‌‌లోనే ఇప్పటికే ఇటువంటి 20 కేసులు నమోదయ్యాయని,  బాధితులు రూ. 4 కోట్లకు పైగా నష్టపోయారని హైదరాబాద్​ సైబర్​క్రైమ్స్​ ఏసీపీ మారుతి వెల్లడించారు.  ముఖ్యంగా వీళ్లు చార్టర్డ్ అకౌంటెంట్లు, సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్లు, లాయర్ల వంటి వారిపై కన్నేస్తారు. హైదరాబాద్‌‌కు చెందిన ఒక లాయర్​ రూ. 85 లక్షలు, ఐటీ ఉద్యోగి రూ. 55 లక్షలు, చార్టర్డ్ అకౌంటెంట్ రూ. 91 లక్షలు, మరో ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగి రూ. 25.30 లక్షలను ట్రేడింగ్​ స్కామ్​ కారణంగా పోగొట్టుకున్నారు. 

ఎలా మోసం చేస్తారంటే...

 పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మోసగాళ్లు తమ సోషల్ మీడియా ప్లాట్‌‌ఫారమ్‌‌లలో తమ క్లయింట్లు సంపాదించిన లాభాల  నకిలీ స్క్రీన్‌‌షాట్‌‌లను అప్​లోడ్​ చేస్తారు. పెట్టుబడిదారులు డబ్బు పెట్టడానికి ఆకర్షితులైతే,  మొదట్లో డబ్బును వారి బ్యాంక్ ఖాతాకు లాభాలుగా బదిలీ చేస్తారు. పూర్తిగా నమ్మకం కుదిరాక పెట్టుబడిదారుడు తమ ప్రీమియం/వీఐపీ ఛానెల్స్​మెంబర్షిప్​ తీసుకోవాలని బలవంతం చేస్తారు.

తద్వారా మరిన్ని లాభాలు వస్తాయని ఆశచూపుతారు. బాధితులు ఇలాంటి మెంబర్షిప్​ తీసుకోగానే, వారి బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు పంపాలని అడుగుతారు. మరిన్ని లాభాలు వస్తాయని చెబుతారు. వెబ్‌‌సైట్‌‌లో చూపించే నకిలీ లాభాలను  విత్​డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ఆప్షన్​ బ్లాక్​ అయి ఉంటుంది. అన్‌‌బ్లాక్ చేయడానికి మరింత డబ్బు డిమాండ్​ చేస్తారు. డబ్బు పంపగానే తీసుకొని మాయమవుతారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సెబీలో రిజిస్టర్ కాని అప్లికేషన్లను నమ్మకూడదు. ఎవరికీ డీమ్యాట్ ఖాతా వివరాలను ఇవ్వకూడదు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్​లను డౌన్​లోడ్​ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సంస్థ గురించి చెక్​ చేసుకోవాలి.  ఇటువంటి స్కామ్‌‌స్టర్ల పాన్ వివరాలతో సెబీ ఒక డేటాపూల్​ను కూడా నిర్వహిస్తోంది. దానిని చెక్​ చేశాకే పెట్టుబడి పెట్టాలి.