- గడ్డి, పొదల అంచుల్లో బ్యాక్టీరియా
- గడ్డి మీద కూర్చున్నా, పడుకున్నా ఎఫెక్టే
- ఏపీలో ఇప్పటికే 174 కేసులు నమోదు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు అసాధారణంగా పెరుగుతున్నాయని, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏపీలో 174 పైగా కేసులు నమోదైతే విశాఖలోనే 130 పైగా ఉన్నాయని, 8 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ వ్యాధి ఓరియంటియా సుట్సుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని కొండాపూర్ కు చెందిన హోమియోపతి డాక్టర్అనుభ చెప్తున్నారు.
చిగర్స్ (చిన్న లార్వల్ మిట్స్) అనే పురుగుల కాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుందని, ఇవి ఎక్కువగా గడ్డి, పొదల అంచులు, అటవీ ప్రాంతాల్లో కనిపిస్తాయన్నారు. సాధారణంగా మిట్స్ (చిగర్స్) ఉన్న పొదలు, గడ్డి, చెట్లు ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మొదట జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో ప్రారంభమవుతుందని చెప్పారు. దీని నుంచి రక్షణ పొందాలంటే గడ్డి మీద నేరుగా కూర్చోవడం, నిద్రించడం చేయకూడదన్నారు.
పొలాలు, అడవి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పూర్తిగా చేతులు, కాళ్లు కప్పే దుస్తులు ధరించాలన్నారు. ఇంటి చుట్టుపక్కల అతిగా పెరిగిన పొదలు, గడ్డి తొలగించాలన్నారు. పర్యావరణ పరిశుభ్రత ద్వారా సంక్రమణ అవకాశాలను తగ్గించవచ్చని, దీర్ఘకాలికంగా శరీరాన్ని బలపరిచే ఇమ్యూనిటీ బూస్టింగ్ పద్ధతులు అవసరమన్నారు.

