
- టైర్ 2, 3 సిటీలకు విస్తరిస్తున్న కంపెనీలు
- ప్రజల్లో పెరుగుతున్న ఫైనాన్షియల్ లిటరసీ..మ్యూచువల్ ఫండ్స్, యులిప్‌లకు డిమాండ్
- 2030 నాటికి 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా: అడెకో ఇండియా రిపోర్ట్
ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్‌ఎస్‌ఐ) సెక్టార్ భారీగా నియామకాలు చేపడుతోంది. కంపెనీలు టైర్ 2,3 సిటీలకు విస్తరిస్తుండడంతో ఉద్యోగుల అవసరం పెరిగింది. హెచ్‌ఆర్ కంపెనీ అడెకో ఇండియా రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సెక్టార్‌లో 8.7 శాతం ఉద్యోగ వృద్ధి నమోదవుతుందని అంచనా. 2030 నాటికి ఇది 10శాతానికి చేరే అవకాశం ఉంది. బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లో సుమారు 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. “బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లోని కొత్త ఉద్యోగాల్లో 48శాతం వరకు టైర్ 2,3 సిటీల నుంచే వస్తున్నాయి” అని అడెకో పేర్కొంది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలను గమనిస్తే బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లో ఉద్యోగ నియామకాలు ఏడాది లెక్కన 27శాతం పెరిగాయి. ఫ్రంట్‌లైన్, డిజిటల్, కంప్లయన్స్ విభాగాల్లో ఎక్కువ వృద్ధి కనిపించింది. స్థానిక భాషలో ప్రావీణ్యం, గ్రామీణ మార్కెట్ అనుభవం ఉన్న అభ్యర్థులను ఫైనాన్షియల్ సంస్థలు తీసుకోవడం పెంచాయి. వీరికిచ్చే శాలరీ సగటు కంటే 10–15 శాతం ఎక్కువగా ఉంటోంది. ప్రజలు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్), మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ వంటి సేవింగ్స్ స్కీమ్‌ల వైపు మారుతున్నందున, బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ట్యాలెంట్ ఉన్నవారికి డిమాండ్ కనిపిస్తోంది. బ్యాంకులు సేల్స్, రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్‌లు, డిజిటల్ ప్రొడక్ట్ మేనేజర్లు, క్రెడిట్ రిస్క్ ఎనలిస్టుల నియామకాన్ని పెంచుతున్నాయి. వెల్త్, ఇన్సూరెన్స్ సంస్థలు ఫైనాన్షియల్ ప్లానర్లు, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు, డిజిటల్ అండర్‌రైటర్లు, క్లయిమ్ ఆటోమేషన్ నిపుణులను ఎక్కువగా కోరుతున్నాయి. దీంతో ఇండోర్, కోయంబత్తూరు, నాగ్‌పూర్, గౌహతిలో నియామకాలు 15–-18 శాతం పెరిగాయి. సూరత్, జైపూర్, లక్నో, భువనేశ్వర్‌లో 11–13 శాతం వృద్ధి కనిపించింది.
నియామకాల్లో మ్యూచువల్ ఫండ్స్ ముందు..
“బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో నియామకాలు ఊపందుకున్నాయి. డిజిటల్ -ఫస్ట్ ఇన్వెస్టర్లు పెరుగుతుండడంతో పాటు, కంపెనీలు టైర్ 2, 3 సిటీలపై ఫోకస్ పెంచడంతో కొత్త ఉద్యోగుల అవసరం ఎక్కువైంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థల నియామకాలు 2024–25 లోని మొదటి ఆరు నెలల్లో 9 శాతం పెరిగాయి” అని అడెకో ఇండియా డైరెక్టర్ కార్తికేయన్ కేశవన్ అన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో 78శాతం సంస్థలు ఉద్యోగుల స్కిల్స్‌ను పెంచడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. వీటి క్లయిమ్ ఎఫిషియెన్సీ 30శాతం పెరిగిందని అంచనా. ఫైనాన్షియల్ లిటరసీ మెట్రోలకు వెలుపల విస్తరిస్తుండటంతో, స్థానికంగా ఉద్యోగాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. నియామకాలు 30శాతానికి పైగా పెరిగే అవకాశం ఉంది. “ఎన్విరాన్‌మెంటల్, సోషియల్, గవర్నెన్స్ (ఈఎస్‌జీ) స్ట్రాటజీ, ఏఐఎఫ్ (ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్) /పీఎంఎస్ (పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్) కంప్లయిన్స్, డిజిటల్ వెల్త్ ఫంక్షన్లలో మిడ్- టు -సీనియర్ నియామకాలు 30శాతం పెరిగాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ జాబ్స్‌కు పెద్దగా డిమాండ్ లేదు” అని కేశవన్ తెలిపారు.