ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్ గా భద్రాచలం, కొణిజర్ల ఎంపిక

  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  మోడల్ సోలార్ విలేజ్ గా భద్రాచలం, కొణిజర్ల ఎంపిక

ఖమ్మం, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మోడల్​ సోలార్​ విలేజ్​ గా భద్రాచలం, కొణిజర్ల ఎంపికయ్యాయి. కేంద్ర నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధాన్ మంత్రి సూర్య ఘర్ : ముఫ్త్ బిజ్లీ యోజన (పీఎం ఎస్​జీఎంబీవై)లో భాగంగా ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా ప్రకటించే కార్యక్రమం చేపట్టారు.ఈ పథకంలో భాగంగా గృహాలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ సంస్థలు సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 

టీజీ రెడ్కో, టీజీఎన్​పీడీసీఎల్, పంచాయతీ రాజ్ శాఖల సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో అన్ని గ్రామాల నుంచి సేకరించిన నివేదికల ఆధారంగా ఇప్పటికే అధికంగా సోలార్​ ఎనర్జీ ఉపయోగిస్తున్న గ్రామాన్ని మోడల్ సోలార్​ విలేజ్​ గా జిల్లా కమిటీ ఎంపిక చేసింది. ఖమ్మం జిల్లాలో కొణిజర్లలో ఇప్పటికే 75 కిలోవాట్ల సామర్థ్యంతో గరిష్ఠ సౌరశక్తి వినియోగం ఉండడంతో దాన్ని ఎంపిక చేశారు. 

అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం గ్రామాన్ని ఎంపిక చేశారు. అక్కడ విద్యుత్ వినియోగదారులు అధికంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో భద్రాచలం గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా జిల్లా స్థాయి కమిటీ ఎంపిక చేసింది. త్వరలో రెండు జిల్లాలకు సంబంధించిన వివరమైన ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్​) సిద్ధం చేసి, జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందిన తర్వాత వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. 

కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రెండు గ్రామాలకు రూ.కోటి చొప్పున ప్రోత్సాహక నిధులు మంజూరు చేయనున్నారు. ఈ నిధులను గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ వాటర్ సర్వీస్ కు సోలార్ ప్లాంట్లు మరియు సౌర వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.