భద్రాద్రిలో సోలార్ ​పవర్​కు బ్రేక్

భద్రాద్రిలో సోలార్ ​పవర్​కు బ్రేక్
  • కాంట్రాక్టర్​ మరణంతో నిలిచిన ప్రాజెక్ట్
  • తొలి సోలార్​ టెంపుల్​కు మధ్యలోనే అడ్డంకులు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం రామాలయంలో సోలార్ పవర్ ప్రాజెక్ట్​కు బ్రేక్ పడింది. ప్రాజెక్ట్​ను చేపట్టిన సన్ టెక్నాలజీస్ సంస్థ కాంట్రాక్టర్ రెండు నెలల కింద అనారోగ్యంతో చనిపోయారు.  దీంతో ప్రాజెక్టు మధ్యలోనే నిలిచిపోయింది. తెలంగాణలోనే తొలి సోలార్ టెంపుల్​గా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని చరిత్రకెక్కించాలనుకున్న ఆఫీసర్ల ఆశలు అడియాశలు అయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ సంస్థకు రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల్లో ఈ సన్ ​టెక్నాలజీస్ సంస్థే సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసింది. ఈ సంస్థతోనే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అగ్రిమెంట్​ చేసుకుంది. సడన్​గా కాంట్రాక్టర్ చనిపోవడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.

మూడేండ్ల కింద మొదలు..

రామాలయానికి సోలార్ ​వెలుగులు ఇచ్చేందుకు  సన్​ టెక్నాలజీస్ సంస్థ మూడేండ్ల కింద దేవస్థానం ఆఫీసర్లను కలిసింది. ఈఈ రవీందర్​కు సన్నిహితుడైన కాంట్రాక్టర్​ తక్కువ ఖర్చుతోనే 25 ఏండ్ల పాటు ఒకే ధరకు సోలార్ లైటింగ్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే ఎండోమెంట్​ కమిషనర్​ పర్మిషన్​ కోసం ఒక ఏడాది, అగ్రిమెంట్లు ఇతరత్రా విషయాలకు మరో ఏడాది, మూడేండ్ల తర్వాత 2022 నవంబర్​లో పనులు షురూ అయ్యాయి.  జార్ఖండ్ నుంచి వచ్చిన సంస్థ ముగ్గురు టెక్నీషియన్లు సోలార్ ప్లేట్లు అమర్చారు. మొత్తం 27 కాటేజీలు, 140 రూములు, రామాలయం, నిత్యాన్నదాన సత్రం ఇలా అన్ని చోట్ల 300 కిలోవాట్ల మేర విద్యుత్​ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. 

160 కిలోవాట్ల పనులు జరిగాక సంస్థ  కాంట్రాక్టర్​ అనారోగ్యంతో చనిపోవడంతో పనులు నిలిపివేశారు.  నెల రోజుల నుంచి పనులు జరగడం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా 10 కిలోవాట్ల వరకు యూనిట్​కు రూ.5.80లు, 11 వాట్ల నుంచి 100 కిలోవాట్ల వరకు యూనిట్​కు రూ.5.50లు, 100 కిలోవాట్లపైన వాడితే యూనిట్​కు రూ.4.80లు సంస్థకు దేవస్థానం చెల్లించేలా అగ్రిమెంట్ జరిగింది. ప్రాజెక్టు ఖర్చు మొత్తం సంస్థదే. బిల్లులు మాత్రమే దేవస్థానం చెల్లిస్తుంది.  శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నెలకు రూ.7లక్షలకు పైగా కరెంట్​ బిల్లులు కడుతోంది. సంవత్సరానికి రూ.84లక్షలు పవర్​ బిల్లులకే ఖర్చు అవుతోంది. సోలార్​ పవర్​ ప్రాజెక్టు ద్వారా 40శాతం బిల్లులు దేవస్థానానికి ఆదా అవుతాయి. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు ఆగిపోవడంతో కాంట్రాక్టు నిలిచిపోయింది.

సంస్థతో సంప్రదింపులు.. 

కాంట్రాక్టు అగ్రిమెంట్​ చేసుకున్న సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రాజెక్టు రెండు నెలల కింద ఆగిపోయింది. అగ్రిమెంట్​ చేసుకున్న కాంట్రాక్టర్​ అనారోగ్యంతో చనిపోయారు. మిగిలిన పనులు ఆ సంస్థతోనే చేయించేలా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి వరకు సగం పనులు జరిగాయి. 
- రవీందర్​రాజ్​, ఈఈ, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం