ముక్కోటికి భద్రాద్రి ముస్తాబు..నేడు తెప్పోత్సవం.. రేపు వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం

ముక్కోటికి భద్రాద్రి ముస్తాబు..నేడు తెప్పోత్సవం.. రేపు వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం

భద్రాచలం, వెలుగు : శ్రీవైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వారదర్శనం కోసం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ముస్తాబైంది. విద్యుత్​కాంతులతో శ్రీరామదివ్యక్షేత్రం విరాజిల్లుతోంది. ఉత్సవాలు తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రి బాట పట్టారు.

 దీనితో ఆలయపరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సుమారు లక్ష మంది భక్తులు ఉత్సవాలను తిలకించేందుకు వస్తారనే అంచనాతో ఈవో దామోదర్​రావు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం గోదావరిలో హంసావాహనంపై తెప్పోత్సవం, మంగళవారం ఉదయం వైకుంఠ ఉత్తరద్వార దర్శనం జరగనున్నాయి.

కలెక్టర్​ఆధ్వర్యంలో ఏర్పాట్లు..

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల అవసరార్ధం ప్రత్యేక వైద్యశిబిరాలు, అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్, ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక బెడ్లు, వైద్యనిపుణులను ఏర్పాటు చేశారు. పంచాయతీ సిబ్బందితో నిత్యం రెండు రోజుల పాటు తాగునీటి వసతి కల్పించేలా ప్లాన్​ చేశారు. వాటర్​ ప్యాకెట్లు సిద్ధం చేశారు. శానిటేషన్​ సిబ్బందిని రప్పించి రౌండ్​ ది క్లాక్​ టౌన్​ను శుభ్రం చేస్తున్నారు. గోదావరి తీరంలో భక్తులు నదిలోకి దిగకుండా బారికేడ్లు నిర్మించారు. గజ ఈతగాళ్లను నియమించారు. 

పడవల్లో లైఫ్​ జాకెట్లు, రక్షణ కవచాలు, రెస్క్యూ టీమ్​తో పహారా కాస్తున్నారు. దేవస్థానం ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేసింది. అదనంగా 2లక్షల లడ్డూలు తయారు చేయించారు. భక్తులు కోరుకున్న ప్రసాదం సకాలంలో అందజేసేలా ఏర్పాట్లు జరిగాయి. వైకుంఠ ఏకాదశి వేళ భక్తులు దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక యాక్షన్​ ప్లాన్​ అమలు చేస్తున్నారు. 

వైకుంఠ ద్వారం నుంచి వెళ్లే భక్తులకు, సర్వదర్శనం క్యూలైన్లలోని వారికి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఫైర్​ సిబ్బందిని అలర్ట్ చేశారు. తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తరద్వార దర్శనం భక్తులు వీక్షించేలా ఎల్​ఈడీలు పెట్టారు. తాత్కాలిక వసతిని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆఫీసర్లను అప్రమత్తం చేశారు.

భారీ బందోబస్తు.. 

ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులతో పహారా కాస్తున్నారు. ఎస్పీ రోహిత్​ రాజ్​ ఆధ్వర్యంలో సుమారు 800 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్​ లు తనిఖీలు చేస్తున్నాయి. వీవీఐపీలు, వీఐపీలు వచ్చినప్పుడు, స్వామి తిరువీధి సేవకు వెళ్లేటప్పుడు భక్తుల రద్దీని నియంత్రించేందుకు రోప్​ టీమ్​లను సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులకు డ్యూటీలు కేటాయిస్తున్నారు. 

తెప్పోత్సవం నిర్వహించే హంసావాహనం ట్రయల్​ రన్​ కూడా విజయవంతంగా పూర్తిచేశారు. లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకునేలా సూచనలు చేశారు. తెప్ప భద్రతపై తనిఖీలు నిర్వహించారు.