ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: ఏకాదశి వేళ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆంతరంగికంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేసి, బాలబోగం నివేదించారు. తర్వాత బంగారు కవచాలను అలంకరించి ఆరాధనలు చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారికి గర్భగుడిలో తిరుమంజనం నిర్వహించారు. లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చనలు జరిగాయి. కల్యాణమూర్తులకు ప్రాకార మండపంలో నిత్య కల్యాణం చేశారు. 24 జంటలు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించారు. కార్తీక ఏకాదశి సందర్భంగా చిత్రకూట మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించగా రెండు దఫాలుగా 45 జంటలు ఈ పూజల్లో పాల్గొన్నాయి.మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ నిర్వహించి అద్దాల మండపంలో శ్రీసీతారామచంద్రస్వామికి సంధ్యా హారతి ఇచ్చారు. తిరువీధి సేవ జరిగింది. అనంతపురం జిల్లాలోని శ్రీశ్రీశ్రీ శృంగేరీ విరూపాక్ష మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్య నృసింహ భారతి స్వామీజీ రామయ్యను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. కాగా ఏపీలోని కాకినాడకు చెందిన చిట్టూరి శివాజీ నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. 

14న శ్రీరామపునర్వసు దీక్షలు
ఈ నెల 14న కార్తీక పునర్వసు నక్షత్రం రోజున శ్రీరామపునర్వసు దీక్షలు ప్రారంభించి మార్గశిర పునర్వసు డిసెంబరు 11న విరమణ ఉంటుందని ఈవో శివాజీ తెలిపారు. 14న ఉదయం 10 గంటలకు భక్తులకు దీక్షలు ఇస్తామని తెలిపారు. విరమణ రోజున భద్రగిరి ప్రదక్షిణ, శోభాయాత్ర, పాదుకాపూజ అనంతరం దీక్షలు విరమింప చేస్తామని వివరించారు. ఆ రోజు రాత్రి వెండి రథ సేవ నిర్వహించి 12న శ్రీరామపట్టాభిషేకం చేస్తామని తెలిపారు. 

జర్నలిస్టుల సమస్యలపై పోరాటం
సత్తుపల్లి, వెలుగు: జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తామని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ అన్నారు. శుక్రవారం జిల్లా ఉపాధ్యక్షుడు తోట కిరణ్ అధ్యక్షతన డివిజన్ స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘ నాయకులు బొల్లం శ్రీనివాసరావు, సాంబశివరావు, రామకృష్ణ,  సంతోష్ కుమార్, వెంకటరమణ పాల్గొన్నారు.

 ప్రమాదంలో చనిపోతే రూ.52 లక్షల ప్రమాద బీమా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: యూబీఐలో సాలరీ అకౌంట్​ ఉన్న సింగరేణి ఉద్యోగులు, అధికారులు ఏదేని ప్రమాదంలో చనిపోతే రూ.52 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు సింగరేణి కాలరీస్​ కంపెనీ డైరెక్టర్​ డి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం బ్యాంక్​ అధికారులతో సింగరేణి హెడ్​ ఆఫీస్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదికి రూ.313 చెల్లిస్తే అదనంగా రూ.30 లక్షల బీమా సదుపాయం ఉంటుందని చెప్పారు. యూబీఐ ఏటీఎంలలో రోజుకు రూ.లక్ష తీసుకునే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. జీఎం(పర్సనల్) ఎ ఆనందరావు, జీఎం (ఫైనాన్స్)​ సుబ్బారావు, ఎస్ఓటూ డైరెక్టర్​(ఫైనాన్స్)​ కవిత, ఫైనాన్స్​ మేనేజర్​ రాజేశ్వర్, బ్యాంక్​ ఆఫీసర్లు వంశీకృష్ణ, రాజశేఖర్, కిషన్, నాగేంద్రబాబు పాల్గొన్నారు. 


మన బడి పనులు కంప్లీట్​ చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: మన ఊరు–మన బడి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్  వీపీ గౌతమ్  ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ  ఈ నెల 15లోగా పూర్తయిన మనబడి పనుల బిల్లులు అందజేయాలని, 12 పాఠశాలల్లో 27 అడిషనల్​ క్లాస్​ రూమ్స్​ నిర్మాణానికి ప్రపోజల్స్​ పంపించాలని సూచించారు. గిరిజన సంక్షేమం, ఆర్అండ్​బీ శాఖలు చేపట్టిన పనుల్లో వేగం పెంచాలన్నారు. అడిషనల్​ కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఈవో ఎస్  యాదయ్య, ఈఈలు నాగశేషు, శ్యాంప్రసాద్, శ్రీనివాసరావు, చంద్రమౌళి, కృష్ణలాల్  పాల్గొన్నారు.

డాక్టర్లు అందుబాటులో ఉండాలి
ఇల్లందు: డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని భద్రాద్రి కలెక్టర్  అనుదీప్  దురిశెట్టి సూచించారు. శుక్రవారం ఆయన ఇల్లందు ఆసుపత్రిని సందర్శించి కొత్తగా ఏర్పాటు చేసిన గైనిక్, డెంటల్, రేడియాలజీ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇల్లందు హాస్పిటల్​ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి మారడంతో నలుగురు ఎంబీబీఎస్ డాక్టర్లతో పాటు డెంటల్, గైనకాలజిస్ట్, రేడియాలజీ, అనస్తేసియా, ఆర్థోపెడిక్ డాక్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్​ చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఓ రవిబాబు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


స్పోర్ట్స్ లీగ్ ను సక్సెస్​ చేయాలి

భద్రాచలం, వెలుగు: ఈనెల 28 నుంచి కిన్నెరసాని స్పోర్ట్స్​ స్కూల్​లో నిర్వహిస్తున్న ఇంటర్​ సొసైటీ స్పోర్ట్స్ లీగ్​ను సక్సెస్​ చేసేందుకు ఆఫీసర్లు యాక్షన్​ ప్లాన్​ తయారు చేయాలని ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రు సూచించారు. శుక్రవారం తన చాంబర్​లో గిరిజన సంక్షేమ, ఎస్సీ గురుకుల ఆర్సీవో, విద్య, పంచాయతీ, విద్యుత్​శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్​ ఏర్పాటు చేశారు. లీగ్​ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 అంశాల్లో నిర్వహించనున్న ఈ క్రీడా పోటీలకు ఏడు సొసైటీల నుంచి 3,500 మంది క్రీడాకారులు వస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు వసతి కల్పించేందుకు ఇన్​చార్జీలను నియమిస్తామని తెలిపారు. క్రీడాకారులు, రిఫరీలకు వేర్వేరుగా వసతి కల్పించాలని సూచించారు. భోజనాల వద్ద బారికేడ్లు, టెంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. స్పోర్ట్స్  ఈవెంట్​ క్యాలెండర్​ తయారు చేయాలని ఆదేశించారు. రివ్యూ మీటింగ్​లో ఏపీవో జనరల్​ డేవిడ్​రాజ్, డీపీవో రమాకాంత్, పాల్వంచ మున్సిపల్​ కమిషనర్​ శ్రీకాంత్, ట్రైబల్​ వెల్ఫేర్​ డీడీ రమాదేవి, ఈఈ తానాజీ, డీఈవో సోమశేఖర్​శర్మ, ఎస్సీ గురుకుల ఆర్సీవో ప్రత్యూష, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్​ వీరూనాయక్​ పాల్గొన్నారు.

డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల ప్రారంభం 
ఖమ్మం టౌన్, వెలుగు: రఘునాథపాలెం మండలం వీఆర్ బంజర, పాపటపల్లి గ్రామాల్లో రూ.2.51 కోట్లతో చేపట్టిన పనులు, డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ప్రారంభించారు. వీఆర్​బంజరలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను, పాపటపల్లిలో రూ.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ప్రారంభించారు. పాపటపల్లిలో రూ.1.51 కోట్లతో నిర్మించిన 30 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు. కొత్తగా మంజూరైన పెన్షన్  గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కలెక్టర్  వీపీ గౌతమ్, ఐడీడీఏ పీవో  గౌతమ్, ఎంపీపీ గౌరి, డీఆర్డీవో విద్యా చందన, పీఆర్  ఈఈ శ్రీనివాస్, ఆర్అండ్ బీ ఈఈ శ్యాంప్రసాద్, లాలు, సర్పంచ్ చెన్నబోయిన ముత్తమ్మ పాల్గొన్నారు.

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
పాల్వంచ, వెలుగు: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని పాల్వంచ డీఎస్పీ టి సత్యనారాయణ సూచించారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో పట్టణ, మండల పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయవద్దని సూచించారు. సీఐ నాగరాజు, పట్టణ, మండల ఎస్ఐలు నరేశ్, ప్రవీణ్ కుమార్, ఎం శ్రీనివాస్ ఉన్నారు.