పోలవరంతో భద్రాచలం మునుగుతది

V6 Velugu Posted on Jun 16, 2021

  • రామయ్య ఆలయ కాంప్లెక్స్‌‌కు ముప్పు
  • పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే దుమ్ముగూడెం దాకా ప్రభావం
  • సీడబ్ల్యూసీకి తెలంగాణ, ఏపీ జాయింట్‌‌ సర్వే రిపోర్టు
  • ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను పట్టించుకోని సర్కారు 
  • ఆర్‍ఆర్‌‌ ప్యాకేజీ, పునరావాస కేంద్రాల కోసం నిర్వాసితుల ధర్నా

హైదరాబాద్‌‌ / భద్రాచలం, వెలుగు: పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే భద్రాచలం సీతారామచంద్ర స్వామి టెంపుల్‌‌ కాంప్లెక్స్‌‌ మునిగిపోతుందని తేలింది. భద్రాచలం విస్టా కాంప్లెక్స్‌‌తో పాటు దుమ్ముగూడెం వరకు ముంపు ప్రభావం ఉంటుందని వెల్లడైంది. పోలవరం బ్యాక్‌‌ వాటర్‌‌ ప్రభావంపై ఏపీ, తెలంగాణ ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్లు క్రాస్‌‌ సెక్షన్‌‌ డేటా జాయింట్‌‌ సర్వే చేసి ఈ ముంపు ప్రభావాన్ని తేల్చాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై శాస్త్రీయంగా స్టడీ చేసి నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని నేషనల్‌‌ గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ (ఎన్జీటీ) నిరుడు సెప్టెంబర్‌‌లో ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం గోదావరి, కిన్నెరసాని నదులు, ముర్రేడు వాగుపై.. పలు ప్రాంతాల్లో వరద, ముంపు ప్రభావంపై తెలంగాణ, ఏపీ ఇంజనీర్లు వేర్వేరుగా సర్వే చేశారు. క్రాస్‌‌‌‌ సెక్షన్‌‌‌‌ డేటా సర్వేలో ముంపు పరిస్థితిని స్టడీ చేశారు. ఆ రిపోర్టును మూడ్రోజుల క్రితం సీడబ్ల్యూసీకి పంపారు. 

ముంపు ఉంటుందన్న హైదరాబాద్‌‌‌‌ ఐఐటీ
పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్నప్పుడు భద్రాచలం వద్ద గోదావరిలో 45 మీటర్లకు పైగా నీళ్లుంటాయని, దీంతో పట్టణానికి ముంపు ప్రమాదం ఉందని నేషనల్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌లో బీజేపీ సీనియర్‌‌‌‌ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌‌‌‌ రెడ్డి పిటిషన్‌‌‌‌ వేశారు. దీనిపై గతంలో హైదరాబాద్‌‌‌‌ ఐఐటీ టెక్నికల్‌‌‌‌ స్టడీ చేసి భద్రాచలం పట్టణానికి ముంపు ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఈ పిటిషన్‌‌‌‌ను విచారించిన ఎన్జీటీ.. వరద ముంపుపై టెక్నికల్‌‌‌‌ స్టడీ చేయాలని సీడబ్ల్యూసీని ఆదేశించింది. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ నిరుడు అక్టోబర్‌‌‌‌ 14న, ఈ ఏడాది మే 6న రెండు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు. రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌‌‌‌ ఇంజనీర్లు జాయింట్‌‌‌‌ సర్వే చేసి వరద ప్రభావాన్ని నిర్ధారించాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి, రెండు రాష్ట్రాల్లో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ వల్ల సర్వే చేయలేదు. ఏపీ ఇంజనీర్లు పోలవరం సీఈ సుధాకర్‌‌‌‌ బాబు ఆధ్వర్యంలో, తెలంగాణ ఇంజనీర్లు కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి నేతృత్వంలో క్రాస్‌‌‌‌ సెక్షన్‌‌‌‌ డేటా సర్వే చేశారు.

స్పిల్‌‌‌‌ వే కెపాసిటీని పెంచడంతో..
పోలవరం స్పిల్‌‌‌‌ వే కెపాసిటీని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచడంతో భద్రాచలం టెంపుల్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌పై ముంపు ప్రభావం ఉంటుందని రెండు రాష్ట్రాలు సమర్పించిన నివేదికల్లో తేలింది. పోలవరంలో గరిష్టంగా 15 రోజుల పాటు పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ ఉండే అవకాశముందని ఇంజనీర్లు లెక్కగట్టారు. అన్ని రోజులు టెంపుల్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌ మునిగిపోకుండా భారీ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడిపోయాల్సి ఉంటుందన్నారు. గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు భద్రాచలం పట్టణానికి వరద ముంపు ఉంటుందని, పోలవరంలో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఆ ప్రభావం ఇంకా ఎక్కువవుతుందని తెలిపారు. గోదావరి నదిలో కిన్నెరసాని కలవడానికి 18.3 కిలోమీటర్ల ముందు వరకు, కిన్నెరసాని నదిలో ముర్రేడు నది కలిసే 5.25 కిలోమీటర్ల వరకు నీళ్లు నిలిచి ఉంటాయని నివేదించారు. దుమ్ముగూడెం వరకు ముంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.

బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌తో భయంభయంగా..
గోదావరి పరివాహక ప్రాంతంలో పోలవరం బ్యాక్‌‌‌‌ వాటర్‍తో భయం రోజురోజుకూ పెరుగుతోంది. నేటివరకూ ఆర్‍ఆర్‌‌‌‌ ప్యాకేజీ, పునరావాస చర్యలు చేపట్టకపోవడంతో కూనవరం మండలం చినార్కూరు వద్ద చినార్కూరు, కొండ్రాజుపేట, పూసుగూడెం గ్రామాల ఆదివాసీలు మంగళవారం రోడ్డెక్కారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అటవీ ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ మండలంలో నర్సింగపేట వద్ద 303 ఎకరాలను సేకరించేందకు గ్రామసభ నిర్వహించారు. గతంలోనే సర్కారుకు పట్టా పాసు పుస్తకాలు, బ్యాంకు అకౌంట్‌‌‌‌ పాస్‌‌‌‌ బుక్స్, ఫ్యామిలీ మెంబర్ల సర్టిఫికెట్ల ఒరిజినల్స్‌‌‌‌ ఇచ్చేశారు. కానీ మళ్లీ అవి కావాలంటూ మీటింగ్‍లో అడగడంతో నిర్వాసితులు ఆందోళనలకు దిగారు.

నిర్వాసితుల పట్ల సర్కారు కర్కశం
పోలవరం నిర్వాసితుల పట్ల సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. త్యాగధనులుంటూనే కట్టుబట్టలతో రోడ్డున పడేసేందుకు, గ్రామాల నుంచి తరిమేసేందుకు సిద్ధమవుతోందని మండిపడుతున్నాయి. నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయించకుండానే కాఫర్‍డ్యాం నిర్మాణం చేపట్టడేమంటని ప్రశ్నిస్తున్నాయి. 41.15 కాంటూరు లెవల్‍లో కాఫర్‍డ్యాం పూర్తయితే ఆగస్టు వరదలకు జలప్రళయం ఖాయమని నిర్వాసితులు భయపడుతున్నారు. భద్రాచలంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండానే కాఫర్‍డ్యాం నిర్మాణం చేపట్టడంపై సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భద్రాచలంకు బ్యాక్ వాటర్‌‌‌‌ వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రధాని మోడీకి పొంగులేటి సుధాకర్‍రెడ్డి కూడా లెటర్‌‌‌‌ రాశారు. 

సాయం లేక గుట్టలెక్కుతున్నరు
సర్కారు నుంచి సాయం అందకపోవడంతో ముంపు ప్రాంతాల ప్రజలు సొంతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముంపు భయంతో ఉన్న ఇండ్లను విడిచి వెళ్లిపోతున్నారు. వీఆర్‍పురం మండలం పోచవరం, జీడిగుప్ప, ములకపాడు, తుమ్మిలేరు, కొండెపూడి, కొల్లూరు, వేలేరుపాడు మండలంలోని పేరంటాలపల్లి, కాకిసనూరు, టేకులూరు, కోయిదా, కటుకూరు తదితర గ్రామాల ప్రజలు తమ ఊరికి దగ్గర్లోని గుట్టలపై పాకలు
నిర్మించుకుంటున్నారు. 

Tagged Telangana, andhrapradesh, CWC, Polavaram project, , Bhadrachalam.

Latest Videos

Subscribe Now

More News