మిస్సింగ్ చిల్డ్రన్ కేసుల పర్యవేక్షణకు నోడల్ అధికారులు..నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం

మిస్సింగ్ చిల్డ్రన్ కేసుల పర్యవేక్షణకు నోడల్ అధికారులు..నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా నమోదైన పిల్లల మిస్సింగ్ కేసులపై పర్యవేక్షణకు కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు/యూటీలు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గురియా స్వయంసేవి సంస్థ దాఖలు చేసిన పిల్ ను  జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్ ధర్మాసనం మంగళవారం విచారించింది. మధ్యవర్తుల ద్వారా పిల్లలను జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలకు అక్రమంగా తరలించి, విక్రయిస్తున్న మానవ అక్రమ రవాణా నెట్‌‌వర్క్ గురించి పిటిషనర్ తరపు అడ్వొకేట్ అపర్ణ భట్ కోర్టుకు నివేదించారు.

 మధ్యలో కేంద్ర తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదిస్తూ.. తప్పిపోయిన పిల్లల కేసులను పర్యవేక్షించడానికి ట్రాక్ చైల్డ్ పోర్టల్, ఖోయా–పాయ పోర్టల్ అనే రెండు పోర్టల్‌‌లు పనిచేస్తున్నాయని ధర్మాసనానికి చెప్పారు. దీనిపై జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకొని ఈ పోర్టల్‌‌లు రెండు వైపులా ఉండే విధానాన్ని కలిగి ఉండాలని సూచించారు. అలాగే కనిపించని పిల్లల పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించాలని  కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు/యూటీలకు స్పష్టం చేసింది.