V6 News

విద్యుత్ కాంతులతో వెలుగుతున్న భద్రాద్రి ఆలయం

విద్యుత్ కాంతులతో వెలుగుతున్న భద్రాద్రి ఆలయం

భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ ఘట్టానికి సమయం దగ్గరపడుతుంది. భద్రాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతుల మధ్య దేదీప్యమానంగా ఆలయంతో పాటు ప్రాంగణాలు మెరిసిపోతున్నాయి. వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికార్లు ఏర్పాట్లు చేస్తున్నారు. పుణ్యక్షేత్రం రామనవమి శోభను సంతరించుకుంది. స్వాగత ద్వారాలు.. చలువ పందిళ్లు.. చాందినీ వస్త్రాలంకరణలు.. విద్యుద్దీపకాంతుల్లో రామాలయ ప్రాంగణం వెలిగిపోతుంది. వైకుంఠమై దర్శనమిస్తోంది ఆలయం. సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన గురువారం మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో నిర్వ హించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి వైకుంఠ ద్వారం వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వ హించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. 

ఈ కల్యాణాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు భద్రాద్రికి చేరుకుంటున్నారు. ఎదుర్కోలు ఉత్సవం, శ్రీరామనవమి, మహా పట్టాభిషేకాలను పురస్కరించుకొని సీతారాములను తీసుకెళ్లే మార్గాన్ని దేవస్థానం అధికారులు, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటికే పరిశీలించారు. రామ నవమి ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ 2,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణానికి త్రిదండి చినజీయర్ స్వామి హాజరుకానుండగా.. ఆయన ఈ రోజు రాత్రికి భద్రాచలంలోని జీయర్ మఠానికి చేరుకోనున్నారు. ఇక శుక్రవారం జరిగే పుష్కర సామ్రాజ్య  పట్టాభిషేకానికి నిబిల జీయర్ స్వామి, దేవనాద జీయర్ స్వామి మార్చి 30వ తేదిన గురువారం రాత్రి భద్రాద్రి చేరుకుంటారు.