గాంధీ నగర్: ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో రైతులు రోడ్డెక్కారు. గుజరాత్‌లోని అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం (జూన్ 16) భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం ప్రభుత్వం అనుమతి లేకుండా తమ భూములను స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది రైతులు ట్రాక్టర్లతో అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
'కిసాన్ అధికార్ యాత్ర' పేరుతో చేపట్టిన ఈ నిరసన ర్యాలీ అహ్మదాబాద్‌లోని శాంతిపుర చౌక్‌డీ నుంచి ప్రారంభమై భారీ ట్రాక్టర్ల కాన్వాయ్‌తో రాష్ట్ర రాజధాని గాంధీనగర్ వైపు కదిలింది. పలువురు రైతులు తమ శ్రమకు, నిరసనకు చిహ్నంగా నాగళ్లను మోసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని.. లేదంటే నిరవధిక ధర్నాకు దిగుతామని రైతులు హెచ్చరించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు ఆప్, పలు రైతు సంఘాలు రైతులకు సంఘీభావం ప్రకటించి ఈ ర్యాలీలో పాల్గొన్నాయి.
గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావడా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు.. స్వయంగా ప్రధాని మోడీ కూడా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ అదానీ, ఇతర కంపెనీలకు చెందిన విద్యుత్ స్తంభాలను రైతుల పొలాల్లో బలవంతంగా పాతుతూ రైతుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంట నష్ట పరిహారం కోరిన రైతులను పోలీసులు కొడుతున్నారు.. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఎరువుల కొరత, నకిలీ విత్తనాల బెడద, ద్రవ్యోల్బణం, తప్పుడు భూమి కొలతలు, సాగునీటి కొరత వంటి సమస్యలతో రైతులు సతమతమవుతుండగా.. వీటికి తోడుగా రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పోలీసులు కంపెనీల ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే:
- తమ భూమిని వాడుకుంటున్నందుకు ప్రభుత్వం నెలకు రూ.50 వేల అద్దె ఇవ్వాలి
- వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించాలి
- అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలి
- పంటలకు సరైన మద్దతు ధర (MSP) కల్పించాలి
- వ్యవసాయానికి వాడే డీజిల్, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు, వ్యవసాయ పనిముట్ల ధరలను భారీగా తగ్గించాలి
- ప్రభుత్వం చేపట్టిన వివాదాస్పద డిజిటల్ లేదా తప్పుడు భూమి రీ-సర్వే, కొలతల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి.
