- భక్తులతో భద్రాద్రి కిటకిట
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి శనివారం స్వర్ణ తులసీదళాలతో అర్చన జరిగింది. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి అర్చకులు గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవను నిర్వహించారు. బాలబోగం నివేదించారు. రామపాదుకలకు భద్రునిసన్నిధిలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. గర్భగుడిలో మూలవరులను అలంకరించి బంగారు తులసీ దళాలతో అర్చన చేసి, విశేష హారతులు సమర్పించారు.
ఆర్జిత సేవల్లో పాల్గొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకెళ్లారు. సీతారాముల కల్యాణం జరపగా 106 జంటలు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, సుముహూర్తంలో మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక, మంత్రపుష్పంతో క్రతువును ముగించారు. సాయంత్రం దర్బారు సేవ చేశారు.
వీకెండ్ ప్రభావంతో భక్తుల రద్దీ
సంక్రాంతి సెలవులు, వీకెండ్ కారణంగా భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వదర్శనం, సుదర్శన ద్వారం వద్ద ఉన్న క్యూలైన్లో భక్తులు దర్శనం కోసం నిరీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆరగింపు తర్వాత మధ్యాహ్నం ఆలయం తలుపులు మూయకుండా దర్శన సౌకర్యం కల్పించారు. ఉదయం దర్శనం తర్వాత పాపికొండల విహారయాత్రకు వెళ్లిన టూరిస్టులు సాయంత్రం కూడా రామదర్శనం కోసం వచ్చారు. రోజంతా ఆలయంలో భక్తులు ఫుల్‌గా ఉన్నారు. ప్రసాదాలు, దర్శనంలో ఇబ్బందులు తలెత్తకుండా ఈవో దామోదర్‌రావు సిబ్బందితో ఏర్పాట్లు చేశారు.
