ముక్కోటి ఏకాదశికి భద్రాద్రి ముస్తాబు.. దశావతారాల్లో భక్తులకు సీతారామచంద్రస్వామి దర్శనం

ముక్కోటి ఏకాదశికి భద్రాద్రి ముస్తాబు.. దశావతారాల్లో భక్తులకు  సీతారామచంద్రస్వామి దర్శనం

భద్రాచలం,వెలుగు: ముక్కోటి వైకుంఠ ఏకాదశికి భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం ముస్తాబువుతోంది.  ఆలయ ఈవో దామోదర్​రావు ఆధ్వర్యంలో పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రభుత్వం రూ.85.29లక్షలను  కేటాయించింది. 

ఈనెల20 నుంచి స్వామి పగల్​పత్ ఉత్సవాల్లో భాగంగా దశావతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 29న గోదావరిలో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనంతో పాటు రోజుకో అవతారంలో కన్పించే స్వామిని తిలకించేందుకు నిత్యం భక్తులు తరలివస్తారు. వారికి అవసరమైన సౌకర్యాలు, సదుపాయాల కల్పన పనులు నిర్వహిస్తున్నారు.  

భక్తులకు వసతి సౌకర్యాలు  

భద్రాద్రి ప్రధాన ఆలయంతో పాటు పరిసర ఉప ఆలయాలకు పంచ రంగులు వేస్తున్నారు. రామాలయానికి 11 రోజుల పాటు విద్యుదీకరణ, లైటింగ్​ఏర్పాటు చేస్తున్నారు. పర్ణశాలతో పాటు భద్రాచలంలో కల్యాణ మండపం, గోదావరి ఘాట్​లో లైటింగ్ ఏర్పాటు, తెప్పోత్సవం పనులు నిర్వహిస్తున్నారు. 

మిథిలాస్టేడియం ప్రాంగణం, మెయిన్​ టెంపుల్​ఏరియా, పర్ణశాలల్లో చలువ పందిళ్లను నిర్మిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో దామోదర్​రావు తెలిపారు.  తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి ఉత్సవాల రోజుల్లో లక్షల మంది భక్తులు తరలి వస్తారని రాత్రి బస చేసేందుకు వీలుగా తాత్కాలిక షెల్టర్లు, కాటేజీలు, రూమ్ లు రెడీ చేస్తున్నామన్నారు.  తాత్కాలిక టాయిలెట్లు, మెడికల్​క్యాంపులు, గోదావరి తీరంలో లైటింగ్, గజ ఈతగాళ్ల నియామకం జరుతుందన్నారు.