- భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పర్యాటక అభివృద్ధితో పల్లెలు ఆర్థిక ప్రగతి సాధిస్తాయని కలెక్టర్జితేశ్వి పాటిల్తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో సోమవారం సర్పంచులకు నిర్వహించిన శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతలో జిల్లాలోని 14 మండలాల్లోని సర్పంచులకు శిక్షణ కొనసాగుతోందని తెలిపారు. పల్లెల అభివృద్ధిలో సర్పంచులదే కీలకభూమిక అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామపంచాయతీలకు వచ్చే ఫండ్స్‌ను సరిగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలను రూపొందించాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను పరిశీలించాలన్నారు. గ్రామపంచాయతీలో జరిగే ప్రతి పని విషయంలో ఆయా శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, జడ్పీ సీఈఓ బి. నాగలక్ష్మి, డీపీఓ సుధీర్, అధికారులు అనూష, ప్రభాకర్, సుభాష్ చంద్ర గౌడ్, రవీందర్, సునీల్ కుమార్, ముత్యాల రావు పాల్గొన్నారు.
