
బూర్గంపహాడ్, వెలుగు : జిల్లాలో ప్రజలకు అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాలు పెంచేలా మోడల్ డెమో ఫామ్ ను రూపొందించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని మొరంపల్లి బంజర గ్రామపంచాయతీ పరిధిలోని జిన్కలగూడెం కెనాల్ పక్కన ఉన్న నీటిపారుదల శాఖ భూమిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మోడల్ డెమో ఫామ్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. మోడల్ డెమో ఫామ్ ను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
డెమో ఫామ్ లో కూరగాయల సాగు, మట్టితో ఇటుకల తయారీ యూనిట్, వెదురు, వాక్కాయ కంచె, క్వాయిల్ యూనిట్ షెడ్, సోలార్ డ్రైవర్ ఏర్పాటు చేయడంతో పాటు మునగ చెట్లు పెంచేలా ప్రణాళికలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఫామ్ ద్వారా రైతులకు మాత్రమే కాకుండా మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కలగడం, సరికొత్త వ్యవసాయ పద్ధతులు పరిచయం కావడం ద్వారా అదనపు ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ వివరించారు. తహసీల్దార్ బీఎన్ ప్రసాద్, ఆర్ఐ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
బ్రిక్ తయారీపై అవగాహన
మణుగూరు : భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే యాష్ ద్వారా ఇటుకలను తయారుచేసి తక్కువ ధరలో ఇందిరమ్మ ఇండ్లకు అందించే అవకాశాలపై అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ జితేశ్ తెలిపారు. దమ్మక్కపేట యాష్ పాండ్ వద్ద తక్కువ ఖర్చుతో క్వాలిటీ బ్రిక్స్ ను తయారు చేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. ఇసుక, సిమెంట్, యాష్, క్లే ఉపయోగించి ప్రయోగాత్మకంగా ఇటుకలను తయారు చేశారు.
ఈనెల 30న బీటీపీఎస్‌లో మూడు బ్రిక్ మేకింగ్ మిషన్స్ ద్వారా విభిన్న కాంబినేషన్లతో బ్రిక్స్ తయారీపై ప్రాక్టికల్ కార్యక్రమం నిర్వహించనున్నామని, ఇది సక్సెస్ అయితే డ్వాక్రా సంఘాల ద్వారా ఇటుకలు తయారు చేస్తామని తెలిపారు.