భద్రాద్రి టెంపుల్ ప్లాన్ రెడీ!

భద్రాద్రి టెంపుల్ ప్లాన్ రెడీ!

450 కోట్లతో పునరుద్ధరణ పనులు

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు తుది దశకు చేరాయి. జనవరి/ఫిబ్రవరిలో టెంపుల్‌‌‌‌ అందుబాటులోకి రానుంది. సుదర్శన యాగమూ అప్పుడే జరగనుంది. దీంతో ఇక భదాద్రిపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఆ ఆలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయానికొచ్చారు. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయికి భద్రాద్రి డిజైన్ల బాధ్యతలిచ్చారని తెలిసింది. రెండు రోజుల క్రితం సీఎంతో ఆనంద్ సమావేశమై డిజైన్లను చూపించగా ఓకే చేశారని సమాచారం. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని డిజైన్లను అధికారికంగా విడుదల చేసే అవకాశముంది. ప్రస్తుతం 60 ఎకరాల్లో ఉన్న భద్రాచలం ఆలయాన్ని 100 ఎకరాల వరకు విస్తరించనున్నట్టు తెలిసింది. మొత్తం పనులకు సుమారు రూ.450 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం.

వచ్చే బడ్జెట్‌‌‌‌లో నిధులు

ఆలయ పునరుద్ధరణకు నిధులను వచ్చే బడ్జెట్‌‌‌‌లో కేటాయించనున్నారు. పునరుద్ధరణ పనులకు త్వరలో భూమి పూజ చేయొచ్చని, 2020లో శ్రీరామనవమి తరువాత పనులు మొదలుపెట్టే అవకాశముందని అధికారి చెప్పారు. చినజీయర్ చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టొచ్చన్నారు. ఆలయం చుట్టూ గ్రీనరీ కనిపించేలా ఏర్పాట్లు చేయనున్నారు. నదికి అటువైపు ఆధునిక సదుపాయాలతో రిసార్ట్స్ కట్టనున్నారు. భద్రాద్రి పనులు పూర్తవగానే బాసర ఆలయంపై సీఎం దృష్టి  పెడుతారని తెలిసింది. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ కూడా ఆలయ పునరుద్ధరణ పూర్తి చేసే అవకాశం ఉంది. బాసర ఆలయ డిజైన్ల బాధ్యతనూ ఆర్కిటెక్ట్ ఆనంద్‌‌‌‌కే ఇచ్చారని
తెలిసింది.

100 మీటర్ల రాముడి విగ్రహం

గుజరాత్‌ లో నర్మదా నదీతీరాన ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్ఫూర్తిగా పోలవరం బ్యాక్ వాటర్‌‌‌‌లో సుమారు 100 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం నిర్మిం చాలని సీఎం ఆలోచిస్తున్నారని అధికారి చెప్పారు. భద్రాద్రికెళ్లే యాత్రికులకు 50కిలోమీటర్ల దూరం నుంచే రాముడి విగ్రహం కనిపించేలా నిర్మాణం ఉంటుందన్నారు. విగ్రహ నిర్మాణ పనులను పటేల్ విగ్రహం తయారు చేసిన సంస్థకిచ్చే అవకాశముందని చెప్పారు.

Bhadradri temple restoration work with Rs.450 crores