ఆబ్కారీ వర్సెస్​ ఆదివాసీలు.. మద్యం షాపుల కోసం ఆఫీసర్ల పట్టు

ఆబ్కారీ వర్సెస్​ ఆదివాసీలు.. మద్యం షాపుల కోసం ఆఫీసర్ల పట్టు
  •     గిరిపల్లెల్లో పెసా గ్రామసభల నిర్వహణ
  •     బలవంతంగా తీర్మానాలు
  •     అడ్డుకుంటున్న ఆదివాసీ సంఘాలు

భద్రాచలం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటు ఎక్సైజ్​శాఖ, ఆదివాసీల మధ్య చిచ్చుపెడుతోంది. ఆదివాసీ ప్రాంతంలో వైన్స్​లు ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్​ అధికారులు నిర్ణయించగా, తమ ఊళ్లల్లో దుకాణాలు పెట్టనిచ్చేది లేదంటూ ఆదివాసీ సంఘాలు పట్టుదలగా ఉన్నాయి. దీంతో గిరిజన పల్లెల్లో పెసా పేరిట నిర్వహిస్తున్న గ్రామసభలు రసాభసాగా మారుతున్నాయి. 2023–-25 మద్యం పాలసీ ప్రకటించక ముందే జిల్లాలో భారీ వర్షాల్లోనే సైతం లెక్కచేయకుండా సర్కారు ఆదేశాలతో గిరిజన పల్లెల్లో మద్యం షాపుల ఏర్పాటు కోసం పీసా గ్రామసభలను నిర్వహించారు. ఈనెల 4న నోటిఫికేషన్.18వ తేదీ వరకు టెండర్లు స్వీకరించనున్నారు.

21న డ్రా తీస్తారు. 21 నుంచి 22వ తేదీ వరకు షాపులు పొందినవారి నుంచి ఫస్ట్ ఇన్ స్టాల్​మెంట్ వసూలు చేస్తారని ప్రభుత్వం ఇటీవలే షెడ్యూల్​రిలీజ్​చేసింది. దీంతో ఆబ్కారీ ఆఫీసర్లు గిరిజన పల్లెల బాట పడుతున్నారు. షాపుల నిర్వహణకు పెసా కమిటీ తీర్మానం తప్పనిసరి. అయితే గిరిజనులు వ్యతిరేకిస్తున్నా తమకు అనుకూలమైనవారితో తూతూమంత్రంగా పీసా గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేయించేస్తున్నారు. దీనిపైనే ఆదివాసీ సంఘాలు నిరసనలకు దిగుతున్నాయి. 

గిరిజనేతరులతో ఓటింగ్...​

ఎలాగైనా తీర్మానం చేయించుకోవాలని ఎక్సైజ్​ అధికారులు గిరిజనేతరులను కూడా పెసా గ్రామసభల్లో ఓటింగ్ లో పాల్గొనేలా చేస్తున్నారు. దీన్ని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల గుండాలలో నిర్వహించిన గ్రామసభలో గిరిజనేతరులు చేతులెత్తినవారిలో ఉన్నారంటూ, ఈ పెసా గ్రామసభ తీర్మానాన్ని రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆళ్లపల్లిలో కూడా వర్షాలు, వరదల సమయంలో గ్రామసభలు నిర్వహించమేంటని మహిళలు నిలదీశారు. అయినా బలవంతంగా గ్రామసభ పెట్టి తీర్మానం చేశారు. 

ప్రచారం, సమాచారం లేకుండానే...!

పీసా(ఎక్స్ టెన్షన్ టు షెడ్యూల్​ఏరియాస్) గ్రామసభ పెట్టాలంటే ముందుగా గ్రామంలో మైక్ ద్వారా ప్రచారం చేయాలి. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో నోటీసులు అంటించాలి. కాని ఇప్పటి వరకైతే ఇవేమీ చేయలేదు. బూర్గంపహాడ్​మండలం సారపాకలో బుధవారం గ్రామసభ పెట్టిన విషయం తమకు తెలియదంటూ గ్వార్​బాయ్ సేవా సంఘం అధ్యక్షుడు గుగులోత్​రాంబాబు ఆరోపించారు. వెంటనే తీర్మానం రద్దు చేసి తిరిగి గ్రామసభ పెట్టాలని ఆఫీసర్లకు వినతిపత్రం అందించారు. భద్రాచలంలోనూ ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా బెల్టు షాపు నిర్వాహకులను తీసుకొచ్చి చేతులెత్తించి తీర్మానం చేశారంటూ ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెసా అర్థాన్నే మార్చేశారంటూ వారు ధ్వజమెత్తుతున్నారు.

ముఖం చాటేసిన ఆబ్కారీ ఆఫీసర్లు..

గ్రామసభల వివరాలు ఇచ్చేందుకు ఆబ్కారీ ఆఫీసర్లు సుముఖంగా లేరు. కనీసం ఫోన్లు ఎత్తడం లేదు. వాట్సాప్​ ద్వారా వివరాలు అడిగినా స్పందించడం లేదు. తాము బిజీగా ఉన్నామంటూ తప్పించుకుంటున్నారు. గతంలో పంచాయతీని యూనిట్​గా గిరిజన ఓటర్లలో1/3వంతు మంది గ్రామసభకు వస్తే కోరం పూర్తయినట్లుగా నిర్ణయించి తీర్మానం కోసం ఓటింగ్ నిర్వహించేవారు. కానీ గిరిజనులు వ్యతిరేకిస్తుండడంతో 1/10వ వంతుకు కోరంను తగ్గించారు. ఇది గిరిజనుల్లో మరింత ఆగ్రహానికి తెప్పిస్తుంది.