లక్ష మందితో భగవద్గీత పారాయణం : శ్లోకాలతో మార్మోగిన పరేడ్ గ్రౌండ్స్

లక్ష మందితో భగవద్గీత పారాయణం : శ్లోకాలతో మార్మోగిన పరేడ్ గ్రౌండ్స్

పశ్చిమబెంగాల్​లో సుమారు లక్ష మంది ప్రజలు కలిసి భగవద్గీత శ్లోకాలు పఠించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కోల్​కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్​లో ఆదివారం (డిసెంబర్ 24న) గీతా పారాయణం చేశారు. యువత నుంచి పెద్దవారి వరకు అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి భగవద్గీత ఆలపించారు. మునులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలతో శ్లోకాలు చదివించారు. దీంతో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 

సుమారు లక్షా 20 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఒకే చోట అత్యధిక మంది గీతా పారాయణం చేసిన కార్యక్రమంగా దీనికి గిన్నిస్ రికార్డు లభించే అవకాశం ఉందని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల రాలేకపోయారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 

పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, ఆ రాష్ట్ర విపక్ష నేత సువేందు అధికారి సహా కీలక ఆర్ఎస్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని భగవద్గీత పారాయణం చేయడం వల్ల సామాజిక సామరస్యం పెంపొందడమే కాకుండా దేశ అభివృద్ధి ప్రయాణానికి సరికొత్త శక్తి లభిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు గీత పరిష్కారం చూపిస్తుందని అన్నారు. 

మరోవైపు.. ఈ కార్యక్రమం అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఒక పార్టీపై మరో పార్టీ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు.

భగవద్గీత ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అతిపెద్ద బహుమతి అని అన్నారు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్. ఈ సంఘటనను అపహాస్యం చేసే వారికి హిందూ మతం, దాని సంప్రదాయాల పట్ల గౌరవం లేదన్నారు. హిందువులను విభజించడానికి ప్రయత్నిస్తున్న వారు తమ ప్రయత్నాలలో విఫలమవుతారని విమర్శించారు. 

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని హిందువులు ఐక్యం అవుతారని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి అన్నారు. భగవద్గీత పఠించడమే కాకుండా హిందువులను ఏకం చేయడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహించినట్లు చెప్పారు. 

బీజేపీ నాయకులకు టీఎంసీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మంత్రి ఉదయన్ గుహ. గీత పారాయణం కార్యక్రమానికి తాము వ్యతిరేకం కాదని, అయితే..బీజేపీ నేతలు దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాలతో మతాన్ని కలపడం బీజేపీకి అలవాటు అని చెప్పారు.