కొండపోచమ్మసాగర్​ కోసం 500 ఊళ్లకు భగీరథ బంద్​

కొండపోచమ్మసాగర్​ కోసం 500 ఊళ్లకు భగీరథ బంద్​
  • మిడ్​మానేరు నుంచి కొండపోచమ్మకు 3 టీఎంసీల నీళ్లు రిలీజ్​
  • ఫలితంగా మిడ్​మానేరులో తగ్గిన వాటర్.. అంతా బురదమయం​
  • ఆ నీళ్లను శుద్ధి చేయలేక మిషన్​ భగీరథ పంపులు ఆపేసిన ఆఫీసర్లు
  • 15 రోజులుగా సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో ఆగిన నీటి సరఫరా
  • మంచినీళ్లకు అరిగోస.. పొలాల్లోని బోర్ల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న జనం

సిరిసిల్ల కలెక్టరేట్/బోయిన్​పల్లి, వెలుగు: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని కొండపోచమ్మసాగర్​కు మిడ్​మానేరు నుంచి ఇటీవల 3 టీఎంసీల నీళ్లు రిలీజ్​ చేయడంతో మూడు నియోజకవర్గాల్లో మిషన్​ భగీరథ నీళ్ల సరఫరా నిలిచిపోయింది. మిడ్​మానేరు ప్రాజెక్టులో 18 టీఎంసీలకుపైగా వాటర్ ఉన్నప్పుడు అంతా బాగానే ఉన్నా, నీటి మట్టం 15 టీఎంసీలకు పడిపోగానే వ్యర్థాలన్నీ బయటకు వచ్చి నీళ్లన్నీ బురదతో నిండిపోయాయి. ఈ క్రమంలో వేములవాడ మండలం రుద్రారంలో ఏర్పాటుచేసిన ఇన్​టేక్​వెల్​ నుంచి వస్తున్న బురద నీళ్లను శుద్ధి చేయలేక ఆఫీసర్లు చేతులెత్తేశారు. ఈ నెల 2 నుంచి మిషన్​ భగీరథ పంపులు బంద్​పెట్టడంతో  పదిహేను రోజులుగా మంచినీళ్లు సప్లయ్​ కాక సుమారు 500 ఊళ్లలో జనం తిప్పలు పడుతున్నారు.  ముందే ఎండాకాలం.. ఇలాంటి టైంలో తాగేందుకు  నీళ్లు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊరవతల పొలాల కాడికి పోయి పంపుల నుంచి నీళ్లు పట్టుకొచ్చుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లి  మండలం మన్వాడలో 27.5 టీఎంసీల కెపాసిటీతో మిడ్​మానేరు (శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు నిర్మించారు. దీన్నుంచే సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని సుమారు 500 ఊళ్లకు వాటర్​ సప్లయ్​ చేస్తుంటారు. ఇందుకోసం వేములవాడ మండలం రుద్రారం వద్ద ఇన్​టేక్​వెల్​ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి రోజూ సుమారు 200  క్యూసెక్కుల నీటిని లిఫ్ట్​ చేసి అగ్రహారంలోని ట్రీట్​మెంట్​ ప్లాంట్​లో శుద్ధి చేశాక మూడు నియోజకవర్గాలకు పంపిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఈసారి మిడ్​మానేరు పూర్తిగా నిండింది. ఇక్కడి నుంచి తరుచూ కొండపోచమ్మ సాగర్​కు నీటిని తరలించడం, కాళేశ్వరం నుంచి ఇక్కడికి లిఫ్టు చేయకపోవడంతో క్రమంగా నీటి మట్టం తగ్గుతూ వచ్చింది. గత నెల రోజులుగా మిడ్​మానేరు నుంచి కొండపోచమ్మ సాగర్​కు  ఏకంగా 3 టీఎంసీల నీటిని తరలించారు. దీంతో ప్రాజెక్టు మట్టం 14.9 టీఎంసీలకు చేరడంతో ఇన్​టేక్​వెల్​ వద్ద వాటర్​ లెవల్స్​ తగ్గిపోయాయి. ప్రాజెక్టులో మునిగిన 40 ఊళ్లన్నీ ఒక్కటొకటీ తేలుతుండడంతో పాత ఇండ్ల వ్యర్థాలు, కుళ్లిపోయిన చెట్లు, చెత్తాచెదారం, డ్రైనేజీ వేస్టేజ్​అన్నీ కలిసి నీళ్లను బురదగా మార్చేశాయి. ఆ నీళ్లను  ట్రీట్​మెంట్​ చేయలేమని భావించిన ఆఫీసర్లు మోటర్లు బంద్​పెట్టి దాదాపు 15 రోజులుగా మూడు నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా నిలిపేశారు.

ప్లాంట్​ క్లీన్​ చేసినా నో యూజ్
నీళ్ల రంగు మారడం, వాసన రావడంతో మార్చి మూడో వారం నుంచే పబ్లిక్ ​నుంచి ఫిర్యాదులు మొదలయ్యాయి. దీంతో ఆఫీసర్లు అగ్రహారంలోని వాటర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్​లో సమస్య ఉందేమోనని క్లీన్​ చేయించారు. 120 మిలియన్ లీటర్స్  కెపాసిటీ గల ఈ ట్యాంక్​లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొల గించారు. అయితే బోయిన్​పల్లి మండలం బోయిన్​పల్లి , విలాసాగర్, కొదురుపాక ప్రైమరీ హెల్త్​ సెంటర్ల  పరిధిలోని ఊళ్లలో సుమారు 100 మందికిపైగా జాండీస్​ బారినపడ్డారు. ఇటీవల సిరిసిల్ల డీఎంహెచ్​వో సుమన్ మోహన్ రావు విలాసాగర్ పీహెచ్ సీ ని సందర్శించి, జాండీస్​కు కలుషిత నీరే కారణమని తేల్చారు. దీంతో ఆఫీసర్లు వాటర్​ సప్లయ్​ నిలిపివేసి శాంపిల్స్​ను పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డుకు, వాటర్​ క్వాలిటీ మానిటరింగ్​ ల్యాబ్​కు పంపించారు.

కాళేశ్వరం నీళ్ల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి
కాళేశ్వరం నుంచి 10 టీఎంసీల నీటిని మిడ్​మానేరులోకి పంప్​ చేస్తే తప్ప 3 నియోజకవర్గాలకు మిషన్ భగీరథ వాటర్​ సప్లై చేసే పరిస్థితి లేదని ఆఫీసర్లు చెప్తున్నారు. పరిస్థితి తీవ్రతను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వెంటనే కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలని కోరినట్లు  మిషన్​ భగీరథ సిరిసిల్ల ఈఈ విజయ్ కుమార్ ‘వెలుగు’తో చెప్పారు. కానీ ప్రస్తుతం మేడిగడ్డ సహా ఎల్లంపల్లి వరకు అన్ని రిజర్వాయర్లు అడుగంటడంతో మార్చి 9నే కాళేశ్వరం పంపులు బంద్​పెట్టారు. ఈ లెక్కన ఇప్పట్లో వాటర్​ ఎత్తిపోయడం కష్టమే. మహా అయితే ఎల్లంపల్లి నుంచి ఒకటీ రెండు టీఎంసీలు లిఫ్టు చేయగలిగినా పెద్దగా ఒరిగేదేమీ కనిపించట్లేదు. ఈ ఎండాకాలం ఎలా గట్టెక్కించాలో  తెలియక ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు. సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్​ ఆఫీసర్లతో రివ్యూ చేసి, ఊళ్లలో గతంలో ఉన్న బోర్లు, బావుల ద్వారా వాటర్​ తీసుకోవాలని, మండలాలు, టౌన్లలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. మరోవైపు పది  పదిహేను రోజులుగా మిషన్​భగీరథ వాటర్​ రాక పబ్లిక్​ సఫర్​ అవుతున్నారు. కేసీఆర్ ​సొంత జిల్లాలోని కొండపోచమ్మ సాగర్​ నింపుకునేందుకు  తమకు తాగునీరు లేకుండా చేశారని మండిపడుతున్నారు.  

ఎన్నిరోజులు తిప్పలు పడాల్నో
మా చొప్పదండిలోని చాలా ఏరియాలకు  నల్లా నీళ్లే దిక్కు. కానీ 15 రోజులకెంచి భగీరథ నీళ్లు వస్తలేవు. నీళ్లు ఎప్పుడు వస్తయని మున్సిపలోళ్లను  అడిగితే మాకు తెల్వదంటున్నరు. మిడ్​మానేరు నుంచే వస్తలేవని తెలిసింది. కానీ ఇక్కడి ఆఫీసర్లన్నా టెంపరరీ ఏర్పాట్లు చేస్తలేరు. పబ్లిక్ బోరు వద్దకు వెళ్తే ఒక్కో బిందె నిండేందుకు 10,15 నిమిషాలు పడ్తున్నది. ఎండకాలంలో నీళ్లు రాక ఎన్నిరోజులు తిప్పలు పడాల్నో సమజైతలేదు.
- అజయ్, చొప్పదండి, కరీంనగర్​ జిల్లా 

నీళ్ల కోసం గోసైతంది
పదిహేను రోజుల సంది మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు. మస్తు గోసైతంది. కలర్​ ఉంటున్నయని, వాసన వస్తున్నయని బంద్​పెట్టిన్రు. ఈడి నీటిని ఏడికో కొంటపోయిన్రట. అందుకే నీళ్లస్తలేవని అంటున్రు. సర్కార్ జల్దిన భగీరథ నీటిని సప్లయ్ చేయాలె. లేదంటే ఎండకాలంలో కష్టమే.
- మేడి ముత్తవ్వ, నారాయణపూర్, సిరిసిల్ల జిల్లా

పొలాల కాడికెంచి నీళ్లు తెచ్చుకుంటున్నం
నీళ్ల కోసం అరిగోసపడ్తున్నం. పంచాయతోళ్లు ట్యాంకర్ల ద్వారా ఇచ్చే నీరు సాల్తలేదు. చేసేది లేక పొలాల కాడికి పోయి పంపుల నీళ్లు  పట్టి తెచ్చుకుంటన్నం. ఎండలు మండుతున్నయ్. గిప్పుడే నీళ్లు బందైతే ఎట్ల? 
- షేక్ చాంద్ బీ, ధర్మారం, కోనరావుపేట మండల, సిరిసిల్ల జిల్లా

నీళ్లు లేకుండా ఎట్లుండాలె?
మిడ్​మానేరులో నీళ్లు తగ్గిపోవడంతో మిషన్ భగీరథ వాటర్ బంద్​పెట్టిన్రు. అంతకుముందు కొద్దిరోజుల పాటు రంగుమారిన నీళ్లను తాగి, చాలా ఊళ్లలో ప్రజలు జాండీస్​బారినపడ్డరు. ఈ విషయంలో కాంప్లెంట్​ చేస్తే మొత్తం వాటర్​ సప్లై ఆపేసిన్రు. ఎండాకాలంలో నీళ్లు లేకుండా ఎట్లుండాలె.
- పాలోజి రాజేంద్రప్రసాద్, వెంకట్రావుపల్లి, బోయిన్​పల్లి మండలం, సిరిసిల్ల జిల్లా 

సీఎం దృష్టికి తీసుకెళ్లినం 
మిడ్​మానేరులో నీళ్లు తగ్గడం వల్లే ఈ సమస్య వచ్చింది. పబ్లిక్​ నుంచి కాంప్లెంట్స్​ రావడంతో వాటర్​సప్లై నిలిపేసినం. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. కాళేశ్వరం ద్వారా మిడ్ మానేరులోకి 10 టీఎంసీల నీటిని రిలీజ్​ చేస్తే మళ్లీ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ వాటర్​ సప్లయ్ చేయొచ్చు. 
- విజయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మిషన్ భగీరథ, సిరిసిల్ల