బషీర్బాగ్, వెలుగు: శ్రీకీర్తి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో భాగ్యనగర్ జాతీయ నృత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నృత్య కళాకారులతో పాటు తెలుగు రాష్ట్రాల కళాకారులు పాల్గొని నృత్య ప్రదర్శనలతో అలరించారు. డాన్స్ ఇండియా ఫెస్టివల్ డైరెక్టర్ డాక్టర్ విక్రమ్ కుమార్ నేతృత్వంలో ప్రముఖ నాట్యగురు డా. సజని వల్లభనేని ఆధ్వర్యంలో నృత్యోత్సవాలు కనువిందు చేశాయి.
ఇటలీలో పుట్టి ఒడిశాలో ఒడిస్సి, చౌ నృత్యాలు నేర్చుకుని గొప్ప నర్తకిగా గుర్తింపు పొందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇలియానా సిటా రిష్టిని ఈ సందర్భంగా మహాంకాళి మోహన్ జాతీయ స్మారక పురస్కారంతో ఘనంగా సత్కరించారు. మహంకాళి మోహన్ జాతీయ యువ పురస్కారాలతో డాక్టర్ దివ్యసేన (భరతనాట్యం, తమిళనాడు), శ్వేత వెంకటేష్ (కథక్, కర్నాటక)లను సన్మానించారు.
డాన్స్ ఇండియా ఉత్తమ నృత్య సంచాలకులుగా మహారాష్ట్ర కళాకారిణి కశ్మిరా త్రివేదిని సత్కరించారు. భాగ్యనగర్ జాతీయ పురస్కారాలను డా. వనజా ఉదయ్, డా. వేలూరి సుమిత్ర, డా. కె. రత్నశ్రీ, డాక్టర్ ఆర్. సుధాకర్, డా. విజయ్ పాల్, డాక్టర్ హెచ్. అనిత స్వీకరించారు. భాగ్యనగర్ రాష్ట్రీయ పురస్కారాలతో ఎం. శ్రీవల్లి (లక్నో), తెలంగాణ కూచిపూడి నాట్య గురువులు అడపా భరణి, బాలాజి, పేరిణి శ్రీనివాస్, క్రాంతి కిరణ్, స్నేహ, లోక చంద్రశేఖర్ రెడ్డి, డా. నళిని, శ్రీలత నారపరాజు, వసంత సంధ్య లను సన్మానించారు.
