భక్త రామదాసు లిఫ్ట్ రిపేర్లకు మోక్షం .. రూ.3.21 కోట్లతో అనుమతులు మంజూరు

భక్త రామదాసు లిఫ్ట్ రిపేర్లకు మోక్షం .. రూ.3.21 కోట్లతో అనుమతులు మంజూరు
  • గతేడాది వరదలతో పూర్తిగా దెబ్బతిన్న లిఫ్ట్, మోటర్లు
  • 60 వేల ఎకరాల ఆయకట్టు రైతులకు లబ్ధి

ఖమ్మం/ కూసుమంచి, వెలుగు:  ఖమ్మం జిల్లాలో గతేడాది భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న భక్త రామదాసు లిఫ్ట్ రిపేర్​ పనులకు మోక్షం కలిగింది. పాలేరు ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చొరవతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3.21 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు జీవో 140ని రిలీజ్​ చేసింది. ఈ నిధులతో కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా దగ్గర ఉన్న భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పంప్​ హౌజ్, ప్రెషర్ మెయిన్​ లో వరదలతో దెబ్బతిన్న మోటార్లు, బ్యాటరీలు, పవర్​ ప్యాక్​ లు, స్టార్టర్లు, 150 హార్స్​ పవర్​ డీ వాటరింగ్ పంప్​ లు, మోటార్​ బేరింగ్స్, ఎక్స్​ టెన్షన్​ ప్యానెల్, ఇతర ఎలక్ట్రిక్​ సామాన్లను రిపేర్ చేయనున్నారు.

 నీటి పారుదల శాఖ ఆపరేషన్​ అండ్​ మెయింటనెన్స్​ విభాగం నుంచి గ్రీన్​ సిగ్నల్ ఇస్తూ జీవో రావడంతో త్వరలోనే పనులను పూర్తి చేయనున్నారు. దీంతో కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్​ మండలాల్లో దాదాపు 60 వేల ఎకరాల ఆయకట్టుకు చెందిన రైతులకు లబ్ధి చేకూరనుంది. 

ఆరు మండలాల్లోని చెరువుల కోసం.. 

పాలేరు రిజర్వాయర్​ నుంచి ఆరు మండలాల్లోని చెరువులను సాగర్​ జలాలతో నింపడం కోసం 2017 లో ఈ లిఫ్ట్ ను నిర్మించారు. పాలేరు నియోజకవర్గంతో పాటు మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్ మండలంతో కలిపి 60 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు అందించేందుకు వీలవుతోంది. శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్టు కింద డీబీఎం 60 వ్యవసాయ భూములకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరందుతుంది. పాలేరు రిజర్వాయర్​ దగ్గర నుంచి రెండు మోటర్ల ద్వారా 5.5 టీఎంసీల నీటిని 16.5 కిలోమీటర్ల దూరంలో దాదాపు 57 మీటర్ల ఎత్తున పంప్​ చేస్తారు. 2018 నుంచి రైతులకు ఉపయోగకరంగా ఉన్న ఈ లిఫ్ట్ గతేడాది వచ్చిన వరదలతో పూర్తిగా దెబ్బతింది. పంప్​ హౌజ్​ కూడా వరద నీటిలో మునగడం, మోటార్లు, ఇతర ఎలక్ట్రికల్ సామాన్లు పూర్తిగా ఇసుకలో కూరుకుపోవడంతో బేరింగ్ లు కూడా దెబ్బతిన్నాయి. 

ఇప్పటికే సిద్ధంగా ఉన్న కొన్ని స్పేర్​ పార్ట్స్​ తో పాడైన వాటిని రిప్లేస్​ చేశారు. రెండు మోటార్లకు గాను ఒక మోటార్​ ను రిపేర్​ చేసి, రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడంతో మిగిలిన అన్నింటినీ బాగుచేయడంతో పాటు, ఎమర్జెన్సీ స్పేర్​ లు, ఆయిల్స్​ ను అందుబాటులో ఉంచుకోనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస​ రెడ్డి చొరవతో ప్రభుత్వం నుంచి నిధులు విడుదలపై ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం 
చేస్తున్నారు.

సంతోషంగా ఉంది.. 

గతంలో మా భూముల్లో పెసర, కంది, వర్షాధారిత పంటలు సాగుచేసేవాళ్లం. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం వచ్చిన తర్వాత వరి, బొప్పాయి, చెరకు, పామాయిల్ సాగు చేస్తున్నాం. గతేడాది వరదలతో లిఫ్ట్ డ్యామేజీ కావడంతో ఈసారి నీళ్లు రావడం కష్టమేనని భయపడ్డాం. కానీ ప్రభుత్వం నుంచి నిధులు రావడం, ముందుగానే ఒక మోటార్​ ను నడిపించి సాగునీటిని అందించడంతో సాగుకు ఇబ్బంది కలగలేదు. నీళ్లు రావడంతో రైతులందరం సంతోషంగా పంటలు సాగు చేస్తున్నాం. –  మొక్క శ్రీను, రైతు, మునిగేపల్లి, కూసుమంచి మండలం 

సాగుకు ఇబ్బంది లేకుండా చర్యలు

భక్త రామదాసు ఎత్తిపోతల కింద రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతేడాది భారీ వర్షాలు, వరదలతో మోటార్లు పాడై ఆగిపోయాయి. అందుబాటులో ఉన్న స్పేర్​ పార్ట్ లన్నీ వాడి ఒక మోటార్​ ను నడిపించి ప్రస్తుతం రైతులకు సాగు నీరందిస్తున్నాం. మళ్లీ సమస్య రాకముందే అన్ని రిపేర్లు చేయించడంతో పాటు అందుబాటులో స్పేర్​ పార్ట్ లను ఉంచుతున్నాం. 

పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి