ఏ చట్టం తీసుకొచ్చినా..కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది : రాహుల్

ఏ చట్టం తీసుకొచ్చినా..కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది : రాహుల్

రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను తెలుసుకోకుండా...వారి భూములను సీఎం కేసీఆర్ ప్రభుత్వం లాక్కొంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ధరణి పోర్టల్ ఓపెన్ చేసి ఎవరి భూములు లాక్కోవాలని సీఎం కేసీఆర్ చూస్తుంటారని తెలిపారు. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు దేశపు ఆస్తులను కేంద్రం ధార పోస్తోందని తెలిపారు. లోక్ సభలో బీజేపీ ఏ చట్టం తీసుకొచ్చినా.. టీఆర్ఎస్ సభ్యులు మద్దతిస్తారని.. వ్యవసాయ చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించినా.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు మద్దతిచ్చారని గుర్తు చేశారు. సమాజంలో ఇబ్బందులు పడుతున్న వర్గాలు గొంతెత్తాలనే లక్ష్యంతో తాము పాదయాత్ర చేస్తున్నామన్నారు.

నిరుద్యోగం, విద్వేషం వంటి వాటికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్రలో కలిసికట్టుగా నడుస్తున్నామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 25 కిలోమీటర్లు నడిచినా.. అలసట కనిపించడం లేదన్నారు. ఇందుకు కారణం ప్రజల ఆప్యాయత, ప్రేమేనన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర శనివారం ఉదయం చౌకూరు నుంచి ప్రారంభమైంది. ఆంథోల్, జోగిపేట, అన్నసాగర్ మీదుగా యాత్ర కొనసాగింది. ఉదయం 10 గంటలకు జోగిపేటలోని దనంపల్లిలో బ్రేక్ ఇచ్చారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటలకు గడి పెద్దాపూర్ వరకు పాదయాత్ర కొనసాగింది. అక్కడే రాహుల్ బస చేశారు. మొత్తం 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది.