
ఐదు రోజులు జిల్లాలోనే... భారీ ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
మెదక్/సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోకి ప్రవేశించనుంది. దివంగత ప్రధాన మంత్రి,ఇందిరాగాంధీ ఎంపీగా పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి మెదక్ జిల్లాలో యాత్ర కొనసాగనుంది. దీంతో ఇతర జిల్లాల కంటే ఎక్కువ సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లీడర్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐదు రోజులు ఇక్కడే..
భారత్ జోడో యాత్ర బుధవారం సాయంత్రం బీహెచ్ఈఎల్ వద్ద సంగారెడ్డి జిల్లాలోకి ఎంటర్కానుంది. 2 నుంచి 6వ తేదీ వరకు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఐదు రోజుల పాటు దాదాపు 90 కిలో మీటర్లు యాత్ర కొనసాగనుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా యాత్ర కొనసాగేలా మాజీ డిప్యూటీ స్పీకర్దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడువునా రాహుల్‌కు వెల్కం చెబుతూ భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. పటాన్చెరు, సంగారెడ్డి, అందోల్, నారాయణ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడో యాత్ర కొనసాగనుంది. ఆయా నియోజకవర్గాలతోపాటు, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలోని ఇతర నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, అనుబంధ సంఘాల కార్యకర్తలతోపాటు, ప్రజలను భారీగా తరలించేలా టీపీసీసీ బాధ్యులు, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్లాన్ రూపొందించారు. ఈ మేరకు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పలుచోట్ల సభల్లో మాట్లాడనుండడంతోపాటు, ప్రజలతో మాటామంతి నిర్వహించనున్నారు.
ఇందిర ప్రాతినిధ్యంతో ప్రాధాన్యత..
1980లో జరిగిన పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా దక్షిణ భారత దేశంలో మెజారిటీ స్థానాల్లో ఎంపీలను గెలిపించుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇందిరాగాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మెదక్ లోక్ సభ స్థానంతో పాటు ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్ బరేలి నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఆమె గెలుపొందారు. అనంతరం ఆమె రాయ్ బరేలి స్థానానికి రాజీనామా చేశారు. 2.32 లక్షల భారీ మెజార్టీతో గెలిచిన మెదక్ నుంచే పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించి ప్రధాని పీఠం అధిష్ఠించారు. ఆ తర్వాత పలుమార్లు ఆమె మెదక్ జిల్లాకు వచ్చారు. 1984 అక్టోబరు 31న ఆమె హత్యకు గురయ్యే వరకు మెదక్ ఎంపీగానే ఉన్నారు. కాగా ఇందిరా గాంధీ మనుమడు రాహుల్ గాంధీ ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేయనుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భార్ జోడో యాత్ర రూట్లో పలుచోట్ల ఇందిరాగాంధీ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన అభివృద్ధి పనుల ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేలా పార్టీ లీడర్లు ప్లాన్ చేశారు.