ప్యాసెంజర్లకు ‘భారత్ యాత్ర సురక్ష’

ప్యాసెంజర్లకు ‘భారత్ యాత్ర సురక్ష’

ఒక స్టాండర్డ్ ట్రావెల్ పాలసీని తెచ్చిన ఐఆర్‌‌‌‌డీఏఐ
రూ. లక్ష-10 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులు కవర్
యాక్సిడెంట్‌‌లో చనిపోతే  రూ. కోటి వరకు కవరేజి 

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: దేశంలోని జనరల్‌‌, హెల్త్‌‌ ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాండర్డ్‌‌ ట్రావెల్ పాలసీ ‘భారత్‌‌ యాత్ర సురక్ష’ను ఆఫర్ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఐఆర్‌‌‌‌డీఏఐ) పేర్కొంది.  ఈ పాలసీని ఆఫర్ చేయడం తప్పనిసరి కాదు. కానీ, భారత్‌‌ యాత్ర సురక్షను తేవాలనుకునే  కంపెనీలు,   ఈ ఏడాది జులై 1 నుంచి  కస్టమర్ల ముందుకు  ఈ పాలసీనీ తీసుకురావాల్సి ఉంటుంది. ఈ పాలసీ దేశమంతటా ఒకేలా ఉంటుంది. అంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకే రకమైన పాలసీ బెనిఫిట్స్‌‌ను అందించాల్సి ఉంటుంది.  ముఖ్యంగా హాస్పిటల్‌‌ ఖర్చుల కోసం రూ. లక్ష నుంచి 10 లక్షల వరకు,  యాక్సిడెంట్ వలన చనిపోతే రూ. లక్ష నుంచి రూ. కోటి వరకు ఈ పాలసీ కవర్ చేస్తుంది. ఫ్లయిట్‌‌ మిస్‌‌ అవ్వడం, లగేజ్‌‌ చెకిన్‌‌ టైమ్‌‌లో మిస్‌‌ అవ్వడం, ట్రిప్‌‌ మూడు గంటలకు మించి ఆలస్యమవ్వడం, క్యాన్షిలేషన్‌‌ వంటివి వాటి కోసం యాడ్‌‌ ఆన్‌‌లను ఈ ట్రావెల్ పాలసీకి జోడించొచ్చు. 
ట్రావెల్ పాలసీ తీసుకోవడం ఇక ఈజీ
 ఈ ట్రావెల్ పాలసీని కేవలం  ఒక జర్నీ కోసమో లేదా ట్రిప్‌‌ కోసమో  పాలసీ హోల్డర్లు తీసుకోవచ్చు. పాలసీని రెన్యువల్ చేసుకోవడానికి వీలుండదు. పాలసీ తీసుకునే వారు ఒకేసారి ప్రీమియం డబ్బులు కట్టాల్సి ఉంటుంది.   ‘ప్రస్తుతం మార్కెట్లో వివిధ కవరేజిలతో వివిధ ట్రావెల్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్‌‌గా ఉండే ఒక ట్రావెల్ పాలసీని తీసుకురావడంతో పాలసీ హోల్డర్లకు అనేక బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ పాలసీ ఎలా పనిచేస్తుంది, క్లయిమ్స్‌‌ ఎలా పే చేస్తారు వంటి అంశాలు ఈజీగా తెలుస్తాయి’ అని ఐసీఐసీఐ లొంబార్డ్‌‌ జనరల్‌‌ ఇన్సూరెన్స్‌‌ పేర్కొంది. ‘వేరు వేరు కవరేజిలతో అనేక ట్రావెల్ పాలసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇన్సూరెన్స్‌‌ తీసుకోవాలనుకునే వారికి ఏ పాలసీ తీసుకోవాలో గందరగోళంగా ఉంది. అందుకే దేశమంతటా ఒకేలా పనిచేసి, సాధారణ ప్యాసెంజర్‌‌‌‌ కనీస అవసరాలను తీర్చగలిగే పాలసీ ఒకటి అవసరం’ అని ఐఆర్‌‌‌‌డీఏఐ తెలిపింది. ఈ పాలసీలో ఎటువంటి కో–పేమెంట్‌‌ ఆప్షన్స్‌‌ లేవు.  కో–పేమెంట్ అంటే క్లయిమ్‌ అమౌంట్‌లో పాలసీ హోల్డర్లు భరించే అమౌంట్‌. కానీ డిడక్టబుల్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి.