రైతులను మళ్లీ నిర్వాసితులుగా మార్చొద్దు

రైతులను మళ్లీ నిర్వాసితులుగా మార్చొద్దు

లక్సెట్టిపేట, వెలుగు: భూ నిర్వాసితులను జాతీయ రహదారి కోసం మళ్లీ నిర్వాసితులుగా మార్చొద్దని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. మూడో ఫేజ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల రైతులతో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో లక్సెట్టిపేట మండలంలోని సూరారం రైతు వేదికలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. గతంలో ప్రాజెక్టు కోసం తమ భూములు కోల్పోయిన రైతులు మళ్లీ నేషనల్ హైవే కోసం నిర్వాసితులుగా మార్చొద్దన్నారు.

ప్రభుత్వం స్పందించి పాత రోడ్డును ఇరువైపులా 30 ఫీట్లుగా పెంచి రహదారి నిర్మించాలని కోరారు. లేకపోతే పాత అలైన్​మెంట్​ని కొనసాగించాలని కోరారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో బీకేఎస్ నాయకులు దోనూరి రాము, శ్రీధర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.