తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘భరోసా సేవలు

తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘భరోసా సేవలు
  • ‘భరోసా’ కేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ మహేందర్ రెడ్డి
  • తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో సేవలు

మేడ్చల్, వెలుగు: మహిళల, చిన్నారుల కోసం షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రాలు ఎంతో అండగా నిలుస్తున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ పోలీస్ క్వార్టర్స్ వద్ద నూతన ‘భరోసా’ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మేడ్చల్ కేంద్రంగా బాలానగర్ జోన్ పరిధిలోని శామీర్ పేట్, జగద్గిరిగుట్ట , మేడ్చల్, ఆల్వాల్, దుండిగల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, బాలానగర్, సనత్ నగర్ తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ భరోసా కేంద్రం సేవలందిస్తుందని చెప్పారు. పోక్సో పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధితులను, అత్యాచారాలకు గురైన మహిళలకు న్యాయం , వైద్య పరీక్షలు, ప్రభుత్వ పరిహారం.. వంటి సేవల కోసం ఈ సెంటర్​ పని చేస్తుందన్నారు. సెంటర్​లో బాధితులకు నైపుణ్యాలను నేర్పించి, వారు సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహదపడతాయన్నారు. బాధితులు కోర్టుకు వెళ్లకుండానే వీడియో స్టేట్మెంట్ లు ఇచ్చే వీలును భరోసా సెంటర్లు కల్పిస్తాయన్నారు. బాధితులకు కేవలం ఒక ఫోన్ కాల్ చేరువలో భరోసా సెంటర్ ఉందనే ధైర్యం రావాలన్నారు. ఈ భరోసా సెంటర్లను జిల్లాల్లో సంబంధిత ఎస్పీలు, కమిషనర్లు పర్యవేక్షిస్తారని, అలాగే రాష్ట్ర స్థాయి లో విమెన్ ప్రొటెక్షన్ సెల్ వారు పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ ఏడీజీ స్వాతీ లక్రా, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, మేడ్చల్ కలెక్టర్ హరీశ్, బాలానగర్ డీసీపీ సందీప్, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత పాల్గొన్నారు.