లక్షల కోట్లు దోచుకొని చుక్క నీరు ఇయ్యలె : డిప్యూటీ సీఎం భట్టి

లక్షల కోట్లు దోచుకొని  చుక్క నీరు ఇయ్యలె :   డిప్యూటీ సీఎం భట్టి
  • అయినా హరీశ్​రావు అడ్డంగా సమర్థించుకుంటున్నడు:
  •  సుందిళ్ల, అన్నారంలోకి నీళ్లు వదిలితే కొట్టుకుపోతాయని 
  • నేషనల్​ డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లు చెప్తున్నరు
  • అయినా హరీశ్ అడ్డంగా సమర్థించుకుంటున్నరని విమర్శ

హైదరాబాద్, వెలుగు: గత సర్కారులో గోదావరి, కృష్ణ నదులపై కొత్తగా కట్టిన ప్రాజెక్టుల నుంచి చుక్క నీరు తీసుకురాకుండా లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకున్నా కాళేశ్వరం నిర్వహణకు ప్రతి ఏటా ప్రభుత్వ ఖజానా నుంచి రూ.25 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రూ.32,848 కోట్లు ఉన్న ప్రాజెక్టు బడ్జెట్ ను రీడిజైన్ పేరిట రూ.1.72 లక్షల కోట్లకు పెంచారని, అయినా పదేండ్లలో ఒక్క ఎకరాకూ నీరు ఇవ్వలేకపోయారని వివర్శించారు. ఇప్పుడు మేమే రిపేర్ చేస్తం అని చెప్తున్నారనీ.. కానీ గతంలో కూడా ఇక్కడ కూర్చొని ఎవరూ అవసరం లేదు.. మేము ఇంజినీరింగ్ చేస్తం అని రీడిజైన్ చేశారని విమర్శించారు. అసలు మీరు ఏం చదువుకున్నారని డిజైన్ చేశారని నిలదీశారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తామన్నారు. బీఆర్ఎస్ కట్టిన డ్యామ్ నిట్టనిలువునా చీలిందని.. కుంగిపోయిందని, ఇక మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ఎక్కడుందని ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో ఆయన శ్వేతపత్రంపై మాట్లాడారు.

94 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు కుంగింది

నీళ్లు వదిలితే మేడిగడ్డ ఒక్కటే కాదు సుందిళ్ల అన్నా రం కూడా కొట్టుకుపోతాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారని భట్టి వివరించారు. రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి, కుంగిపోతుంటే రాష్ట్ర ప్రజలతో పాటు దేశం మొత్తం చూసిందన్నారు. అక్కడ అధికా రులంతా విశ్లేషించి చెప్పారని, అయినా హరీశ్ రావు సమర్థించుకోవడం అన్యాయమని చెప్పారు. 2004లో జలయజ్ఞం పేరిట గోదావరిపై బాబా సాహెబ్ ప్రాణహిత సుజల స్రవంతి పేరిట రూ.38 వేల కోట్లు ఖర్చు చేసి, 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిజైన్ చేశామని గుర్తుచేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో కొంత ప్రాంతం మినహాయిస్తే 7ఉమ్మడి జిల్లాలకు సాగునీరు, తాగునీరు ఇచ్చేందుకు, హైదరాబాద్ పరిసరాల్లోని పరిశ్రమలకు నీళ్లు ఇవ్వాలని ఆ ప్రాజెక్టు డిజైన్ చేశామని వివరించారు. 

32 వేల కోట్లు ఇస్తే 31 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చేవి

ప్రాణహితకు రూ.28 వేల కోట్లు, దేవాదులకు రూ. 2, 227 కోట్లు, ఎస్ఆర్ఎస్​పీ స్టేజ్2కు రూ.200 కోట్లు, గోదావరిపై మొత్తం కలిపినా రూ.32,848 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో 31.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండ కాకపోతే ఏంటని ప్రశ్నించారు. ఆ భారాన్ని మోయలేక లెక్కలు సరిచేయలేక తలలు పగిలిపోతున్నాయన్నారు. వాస్తవాలు వివరించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తుంటే, బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. 

డబ్బులు సంపాదించుకోవచ్చని

152 మీటర్ల ఎత్తు దగ్గర తుమ్మిడి హెట్టి కట్టే యోచన బీఆర్ఎస్ సర్కారుకు లేదని భట్టి చెప్పారు. అందుకే కేంద్రం వద్ద దీనిపై  చర్చించలేదన్నారు. పోలవరం కింద 2 లక్షల ఎకరాలు పోయాయని, ఇదే టైంలో తుమ్మడి హెట్టి కడితే మహారాష్ట్రలో 3వేల ఎకరాలే ముంపునకు గురయ్యేవని చెప్పారు. బీఆర్ఎస్ సర్కా రు వందమీటర్ల వద్ద కాళేశ్వరం కట్టిందన్నారు. అక్క డి నుంచి 500 మీటర్లపైకి నీటిని లిఫ్ట్ చేసిందన్నారు. నీళ్లను లిఫ్ట్ చేస్తేనే గత పాలకులకు లాభమని, పైపులు, మోటార్లు కొనుగోలు చేసి, తద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చని వాళ్లు ఆలోచించారని విమర్శించారు.

డబ్బులిచ్చి కాంట్రాక్టర్లతో పనులు చేయించలే

బీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథ పేరిట రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టిందని, కాళేశ్వరం ఖర్చులు కలిపితే లెక్క మరీ ఎక్కువగా ఉంటుందని భట్టి అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, సబితారెడ్డి పోరాటం చేసి ప్రాణహిత ప్రాజెక్టుకు పునాదిరాయి వేయించారని గుర్తుచేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద లీడర్లకు రూ.10వేల కోట్లు ఇవ్వ లేదని, ఈపీసీ కాంట్రాక్టు ప్రకారం కాంట్రాక్టర్లకు ఇచ్చినట్టు చెప్తున్నారని తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉండి అడ్వాన్స్​లు తీసుకున్న కాంట్రాక్టర్లతో పనిచేయించకుండా ఏం చేశారని ప్రశ్నించారు. ప్రాజెక్టు హ్యాండోవర్ చేసుకోవాలి కదా అని విమర్శించారు. ప్రాణహితకు పెట్టిన పదివేల కోట్లు పోగా మరో రూ.28వేల కోట్లు మిగిలిందని, దాన్ని రూ.1.87లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో రాజీవ్ ఇందిరాసాగర్ ప్రాజెక్టుల పూర్తికి కేవలం రూ. 1,425 కోట్లు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ప్రతి ఏటా రూ.500 కోట్లు ఖర్చు చేసినా మొదటి మూడేండ్లలోనే ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేదని చెప్పారు. ఇందులో 75వేల ఎకరాలు ఇతర రాష్ట్రాలకు పోయినా, నికరంగా రూ 3.25 లక్షల ఎకరాలకు ఖమ్మం జిల్లాలో సాగునీరు అందేదని వివరించారు.