
- సింగరేణి ఆధ్వర్యంలో మరో థర్మల్ ప్లాంట్ నిర్మించాలి
హైదరాబాద్, వెలుగు : రామగుండం ఎన్టీపీసీ ఫేజ్-2లో 2,400 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణం త్వరలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖపై సెక్రటేరియెట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఎన్టీపీసీతో సంప్రదింపులు జరపాలని చెప్పారు.
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో అదనంగా మరో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ నిర్మాణం పనులను చేపట్టాలని ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2031–32 నాటికి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం, అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.
వచ్చే ఎండాకాలంలో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, తొలి విడతలో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మాణం చేస్తున్నదని అధికారులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రాన్స్‌కో, జెన్‌కో ఇన్‌చార్జి సీఎండీ సయ్యద్ ముర్తుజా రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన విద్యుత్ సేవలు అందించాలి
విద్యుత్ ఉద్యోగులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని భట్టి విక్రమార్క సూచించారు. ఉద్యోగులు విద్యుత్ సంస్థల పటిష్టానికి తమ వంతు కృషి చేయాలని ఆదేశించారు. గురువారం విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్(వీఏవోఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య అధ్యక్షతన ప్రతినిధి బృందం సెక్రటేరియెట్‌లో డిప్యూటీ సీఎం భట్టిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వీఏఓఏ ప్రధానకార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. విద్యుత్ సంస్థలు స్వయం సంవృద్ధిని సాధించేందుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని భట్టికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వీఏఓఏ వైస్ ప్రెసిడెంట్ నాసర్ షరీఫ్, జాయింట్ సెక్రటరి వీ పరమేశ్, జే స్వామీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కంపెనీ సెక్రటరి కే. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎంను కలిసిన చిరంజీవి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను గురువారం రాత్రి ప్రజాభవన్ లో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క సత్కారం చేశారు. ఆయన వెంట సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు.