జానా, ఉత్తమ్ నియోజకవర్గాల్లోకి భట్టికి నో ఎంట్రీ

జానా, ఉత్తమ్ నియోజకవర్గాల్లోకి భట్టికి నో ఎంట్రీ
  •  గతంలో  పీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డికి ఇదే పరిస్థితి
  •  సీనియర్ల  తీరుపై కాంగ్రెస్​లో చర్చ 
  •  సూర్యాపేటలో  బీసీ డిక్లరేషన్​ సభ పెట్టాలని ప్రపోజల్​
  •  కర్నాటక  సీఎం సిద్ధరామయ్య, అశోక్​ గెహ్లాట్​ను పిలిచే చాన్స్​

నల్గొండ, వెలుగు : ​సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర  నల్గొండ  జిల్లాలో రూట్​మారింది. గతంలో  పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డికి ఎదురైన పరిస్థితే ఇప్పుడు భట్టి విషయంలోనూ జరిగింది. హాత్​ సే హాత్​ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్​మార్చ్​ పాదయాత్ర 8న(గురువారం)  నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోకి ఎంటర్​ కానుంది. షెడ్యూల్​ ప్రకారం ఈ నెల 22 వరకు జరిగే భట్టి యాత్ర కేవలం దేవరకొండ, నల్గొండ, నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాలకే  పరిమితమైంది. పార్టీ  హైకమాండ్​ ఆదేశాలతో  రేవంత్​ పర్యటించని పార్లమెంట్​ నియోజకవర్గాల్లో భట్టి యాత్ర చేయాల్సి ఉంది. పీసీసీ చీఫ్​ హోదాలో రేవంత్​ రెడ్డి ఉమ్మడి జిల్లాలో జోడో యాత్ర చేయాలని భావించారు. కానీ జిల్లా పార్టీ సీనియర్లు రేవంత్​యాత్రకు అడ్డుచెప్పడంతో ఆయన పర్యటన రద్దు అయ్యింది.

రేవంత్​ ప్లేస్​లో  రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 12 సెగ్మెంట్లలో భట్టి పాదయాత్ర చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా గత నెలలో భువనగిరి పార్లమెంట్​పరిధిలోని మునుగోడు, నకిరేకల్​ నియోజకవర్గాలను వదిలేసి కేవలం ఆలేరు, భువనగిరిలో మాత్రమే పర్యటించారు. ఇప్పుడు నల్గొండ పార్లమెంట్​ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పాదయాత్ర చేయాల్సి ఉంది. కానీ పార్టీ సీనియర్లు సపోర్ట్​ చేయకపోవడంతో నాలుగు నియోజకవర్గాలకే యాత్ర పరిమితం చేశారు.

భట్టి యాత్రను పట్టించుకోని సీనియర్లు..

నల్గొండ ఎంపీ సెగ్మెంట్​ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా కేవలం దేవరకొండ, నల్గొండ, సూర్యాపేటలోనే  భట్టి యాత్ర ఉండేలా ప్లాన్​ మారిపోయింది. నల్గొండ ఎంపీ​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి,  సీనియర్​ నేత జానారెడ్డి ఆధిపత్యం చలాయించే  నాగార్జునసాగర్​, మిర్యాలగూడ, హుజూర్​నగర్, కోదాడ నియోజకవర్గాల్లో భట్టి పర్యటన లేకుండా చేశారు.  దేవరకొండ నుంచి నల్గొండకు వచ్చే మార్గమధ్యలో సాగర్​ పరిధిలో గుర్రంపోడు మండలంతోపాటు,  భువనగిరి ఎంపీ సెగ్మెంట్​లో మిగిలిన నకిరేకల్​ నియోజకవర్గం ఒక్కటే  కవర్​ కానుంది.  మునుగోడుకు రావాలని పాల్వాయి స్రవంతి కోరినప్పటికీ  భట్టి ఒప్పుకోలేదని తెలిసింది.  

భట్టి యాత్రకు పార్టీ కేడర్​ దూరం..

హాత్​ సే హాత్​ జోడో యాత్ర రేవంత్,  భట్టి విక్రమార్క మధ్య చిచ్చు పెట్టింది. పార్టీలో సీనియర్లు రెండు వర్గాలుగా చీలిపోవడంతో  ఆ ఎఫెక్ట్​ భట్టి యాత్రపై పడిందని అంటున్నారు.  భట్టి పాదయాత్రకు  జనం నుంచి ఆశించిన స్థాయిలో  స్పందన లేదని,  రేవంత్​ కేడర్​ దూరంగా ఉండడం కూడా ప్రధాన కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఎన్నికల టైంలో అంత ఖర్చు భరించి జనాన్ని తరలించడం అంటే మాములు విషయం కాదని,  కాబట్టే భట్టి యాత్రకు జనం పల్చగా వస్తున్నారని సీనియర్ నాయకుడొకరు చెప్పారు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో సీనియర్లు సైతం భట్టి యాత్ర ఖర్చు భరించలేకనే బహిరంగ సభల జోలికి పోవడం లేదు. పైగా నకిరేకల్, సూర్యాపేట, దేవరకొండ నియోజకవర్గాల్లో జానారెడ్డి, రేవంత్​ వర్గీయులు అంతగా సీరియస్​గా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు.  

సూర్యాపేటలో బీసీ డిక్లరేషన్​ సభ..

భట్టి యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ డిక్లరేషన్​ సభ పెట్టాలని  హైకమాండ్​ ఆలోచన చేస్తోంది.  20,21 తేదీల్లో సూర్యాపేటలో భట్టియాత్ర కొనసాగనుంది. దీనిలో భాగంగానే  బీసీ డిక్లరేషన్​ సభ పెట్టేందుకు పార్టీ పెద్దలు ప్లాన్​ చేస్తున్నారు. ఈ సభకు కర్నాటక సీఎం  సిద్ధరామయ్య,  రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ను ఆహ్వానించాలని అనుకుంటున్నారు.  సీనియర్లు అందరూ ఏకతాటి పైకొచ్చి ఆమోదిస్తే  బీసీ డిక్లరేషన్​ సభ ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.  బీసీ డిక్లరేషన్​ సభ బాధ్యత పార్టీ హై కమాండ్​ మాజీ ఎంపీ వీహెచ్​కు అప్పగించింది. ప్రస్తుతం ఆయన జిల్లాలోని సీనియర్లతో చర్చలు జరుపుతున్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో సీట్లు కేటాయించాలని, కేంద్రంలో ప్రత్యేకంగా మినిస్ట్రీ ఇవ్వాలన్నది బీసీ డిక్లరేషన్​ ప్రధాన ఉద్దేశమని సీనియర్లు చెప్పారు. 

నల్గొండలో ప్రియాంక గాంధీ సభ..?

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నల్గొండకు  ప్రియాంక గాంధీని ఆహ్వానించి భారీ బహిరంగ సభ పెడ్తామని గతంలో ప్రకటించారు.  భట్టి విక్రమార్క యాత్రలో భాగంగానే ప్రియాంక సభ ఉండొచ్చని అంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి గురువారం హైదరాబాద్​కు చేరుకోనున్నారు. రాహుల్​ గాంధీ ఆహ్వానం మేరకు ఈ నెల 10న  జిల్లా సీనియర్లు ఢిల్లీ వెళ్లనున్నారు. రాహుల్​ గాంధీ సమక్షంలోనే ప్రియాంక గాంధీ సభ, బీసీ డిక్లరేషన్​ సభ గురించి ఫైనల్​ డెసిషన్​ తీసుకుంటామని పార్టీ సీనియర్​ నాయకులు చెప్పారు.