పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతం: భట్టి విక్రమార్క

పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతం: భట్టి విక్రమార్క
  • రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్రలు
  • ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేసే ప్లాన్​ 
  • నిర్మల్​ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

నిర్మల్, వెలుగు :  రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం నిర్మల్ లోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదిలాబాద్ ​జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో కట్టినవేనన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనుల మధ్య నెలకొన్న భూ సమస్యలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోడు భూముల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపుతామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరందాలంటే ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. చిక్మాన్ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తోందని, అందుకే కులగణన జరగకుండా చూస్తోందన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.  ఆదిలాబాద్​ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆత్రం సుగుణ సాధారణ మహిళ అని, ఆమెకు ఓటు వేసి గెలిపిస్తే నిరుపేదల పక్షాన పోరాడుతుందన్నారు. ఏఐసీసీ ఇన్​చార్జి దీపాదాస్​ మున్షీ,  జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, పార్టీ జిల్లా ఇంచార్జ్ సత్తు మల్లేష్ ,డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే లు విఠల్ రెడ్డి,రేఖా నాయక్, రాథోడ్ బాపు రావ్, మాజీ కేంద్రమంత్రి వేణు గోపాల చారి, అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ పాల్గొన్నారు.

బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే : మంత్రి సీతక్క

లోకేశ్వరం: దేశంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం నిర్మల్​ జిల్లా లోకేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బీజేపీ లీడర్లు దేవుళ్ల పేర్లు 
చెప్పుకొని ఓట్లడుగుతున్నారని, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారన్నారు.  బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని, వారి మధ్య అంతర్గత ఒప్పందం ఉందన్నారు. బీజేపీ పదేండ్ల పాలనలో తెలంగాణలో విద్య, వైద్యం అభివృద్ధి చెందలేదని, జీఎస్టీ పేరిట పేదల నడ్డి విరిచారన్నారు. వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని, కొంతమంది మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి నారాయణరావు పటేల్, మండల లీడర్లు సుదర్శన్ రెడ్డి, రామచందర్రావు, పండరి గౌడ్, నాలం గంగయ్య పాల్గొన్నారు.