ఇండియా కూటమి గెలిస్తే దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య బీమా: భట్టి

ఇండియా కూటమి గెలిస్తే దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య బీమా: భట్టి
  •     జనాభా ప్రకారం రిజర్వేషన్లు, సంపద పంచాలి
  •     కాంగ్రెస్ 55 ఏండ్ల పాలనలో పూజలను ఎన్నడూ అడ్డుకోలే
  •     పంజాబ్ ఎన్నికల ర్యాలీలో డిప్యూటీ సీఎం స్పీచ్   

హైదరాబాద్, వెలుగు:  కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మహిళలకు ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం కూడా అందిస్తుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తుందని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం ఈ దేశ సంపదను, వనరులను పంపిణీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు.. మణిపూర్ నుంచి ముంబై వరకూ భారత్ జోడో యాత్ర చేశారన్నారు. మంగళవారం పంజాబ్ లోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని కొట్కపుర అసెంబ్లీ సెగ్మెంట్ లో జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. కాంగ్రెస్ తన 55 ఏండ్ల పరిపాలనలో ఏనాడూ పూజా కార్యక్రమాలను అడ్డుకోలేదన్నారు. కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంటే బీజేపీ మాత్రం కొద్ది మంది పెద్దల కోసం పని చేస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ పేదలకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అదానీ, అంబానీ వంటి కొద్ది మంది పెద్దలకు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసి.. పదేండ్లలో రూ. 100 లక్షల కోట్ల అప్పులతో దేశాన్ని మోదీ అప్పుల కుప్పగా మార్చారని ఆయన ఆరోపించారు. 

రిజర్వేషన్లు 69 శాతానికి పెంచుతం..   

తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. అన్ని చోట్లా అదే తరహాలో రిజర్వేషన్లు పెంచుతామని ఇండియా కూటమి హామీ ఇచ్చిందని భట్టి తెలిపారు. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కాపలా కాస్తున్న వీర జవాన్ల స్థాయిని మోదీ సర్కారు కార్మికుల స్థాయికి దిగజార్చిందని ఆయన విమర్శించారు. అందుకే ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్ని వీర్ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. రైతులు కనీస మద్దతు ధర, రుణమాఫీ కోసం ఢిల్లీలో నెలల తరబడి ఆందోళన చేస్తే.. మోదీ కనీసం పది నిమిషాలు కూడా వారి కోసం కేటాయించలేదన్నారు. దేశంలో హరిత విప్లవం తీసుకువచ్చి వ్యవసాయ ఉత్పత్తులను మూడింతలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదేనని భట్టి అన్నారు. రైతులు, శ్రామికుల రుణమా ఫీకి ఇండియా కూటమి కట్టుబడి ఉందన్నారు.