కాంగ్రెస్ కార్యకర్తలపై ఈగ వాలినా ఊరుకోం

కాంగ్రెస్ కార్యకర్తలపై ఈగ వాలినా ఊరుకోం

భద్రాచలం, వెలుగు: అధికార బలం ఉందని కాంగ్రెస్‍ పార్టీ జోలికొస్తే సహించబోమని, కార్యకర్తలపై ఈగ వాలినా ఊరుకునేది లేదని సీఎల్పీ బృందం నేతలు మల్లు భట్టి విక్రమార్క, రాజగోపాల్‍రెడ్డి, శ్రీధర్‍బాబుతోపాటు మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్‍ హెచ్చరించారు. గత నెల 15న భద్రాచలం కాలనీల్లో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పొదెం వీరయ్యతోపాటు 27 మంది కాంగ్రెస్‍ నాయకులపై పోలీసులు కోవిడ్‍-19 కేసులు నమోదు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే వీరయ్యను వారు మంగళవారం పరామర్శించారు. కేసులు పెడితే ఎవరూ భయపడొద్దని, పార్టీ మొత్తం ఇక్కడే ఉండి అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే ప్రగతి భవన్‍ను 10 లక్షల మందితో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎంతదూరమైనా వెళ్తామని, ఆదివాసీ ప్రజాప్రతినిధిపై కేసులు ఉపసంహరించుకోక పోతే రాష్ట్రపతి, గవర్నర్‍లను కలుస్తామన్నారు. కేసులు పెట్టినంత మాత్రాన భయపడి పారిపోమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ప్రతిపక్షంగా సహకరిస్తూ ప్రజలకు మరింత సేవలు అందిస్తామని అన్నారు. టీఆర్‍ఎస్‍ రాజకీయాలను ఎండగడతామని, కోవిడ్‍-19 నిబంధనలను పాటించని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకుల వీడియోలు సేకరించి సాక్ష్యాలతో సహా ఢిల్లీలోని జాతీయ విపత్తుల శాఖ కార్యాలయంలో అందజేస్తామని పేర్కొన్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు పాలకులకు తొత్తులుగా వ్యవహరించవద్దని, వారి  విలువను కాపాడుకోవాలని కోరారు. ప్రజలు నిలదీసే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. కాంగ్రెస్‍ కార్యకర్తలు తలదించుకోవద్దని, ధైర్యంతో ముందుకు సాగాలన్నారు.

రైతులను దగా చేస్తున్నరు

తెలంగాణ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని సీఎల్పీ బృందం నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో 1.1 కోట్ల టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉంటే ఇప్పటివరకు నెల రోజుల్లో కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే చెడువానలు వెంటాడుతున్నాయని, వచ్చేనెలలో రుతుపవనాలు ప్రవేశిస్తే 75 శాతం ధాన్యం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బత్తాయి, నిమ్మ, మొక్కజొన్న రైతులందరినీ మోసం చేశారని అన్నారు. గన్నీ సంచుల కొనుగోళ్లలోనూ ప్రభుత్వం చేతివాటం చూపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో 87.5 లక్షల తెల్ల రేషన్‍ కార్డులుంటే 74 లక్షల మందికే రూ.1500, 12 కిలోల బియ్యం ఇస్తున్నారని, నిలదీస్తే మరో 5 లక్షల మందికి పోస్టాఫీసుల్లో ఇస్తున్నారని, మిగిలిన 8 లక్షల మంది పేదవారు కాదా అని ప్రశ్నించారు. వీరుగాక అర్హులైనా కార్డులు లేనివారు ప్రతి మండలంలో 2 వేల మంది ఉన్నారని అన్నారు. చేతివృత్తుల వారిని ఆదుకోవాలని, వలస కూలీలను ప్రభుత్వమే సొంత ఖర్చులతో వారి సొంతూళ్లకు తరలించాలని డిమాండ్‍ చేశారు.