
అప్పుడే న్యాయంగా ఉంటుంది.. నీటి వాటాలను తేల్చాల్సింది కేంద్రమే
రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం: డిప్యూటీ సీఎం భట్టి
విశాఖలో ‘స్టాప్ ఓట్ చోరీ’ కార్యక్రమానికి హాజరు
హైదరాబాద్, వెలుగు: వరద జలాలపై ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాతే కొత్త ప్రాజెక్టులు నిర్మించుకుంటే న్యాయబద్ధంగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఏపీలోని విశాఖలో నిర్వహించిన ‘స్టాప్ ఓట్ చోరీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై స్పందించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నీటి హక్కుల కోసమని, రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయ్యి కేటాయింపులు జరిగాకే మిగులు జలాల అంశంపై చర్చలుంటాయని భట్టి స్పష్టం చేశారు. ‘‘సముద్రంలోకి వెళ్లే జలాలు అని మాట్లాడటం సరికాదు. గోదావరిపై మేం చేపట్టిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయంగా ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత మిగులు జలాలుంటే వాడుకోవచ్చు. మా అవసరాలు తీరకుండా దిగువన ప్రాజెక్టులు నిర్మిస్తే కేటాయింపుల్లో సమస్య వస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం, బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసమని భట్టి విక్రమార్క తెలిపారు. నీటి వాటాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదని చెప్పారు. కొన్ని పార్టీలు సెంటిమెంట్ పాలిటిక్స్ చేస్తున్నాయని.. అయితే రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు తమకు ముఖ్యమని ఆయన తెలిపారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దేవాదులు వంటి గోదావరిపై తాము చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని.. తమ ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వాటాలు తేల్చి మిగిలిన వాటిని వాడుకోవచ్చన్నారు.
పార్టీ బలంగా ఉండాలని రాజగోపాల్‌రెడ్డి కూడా కోరుకుంటున్నరు
తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి లేదని భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీ బలంగా ఉండాలని రాజగోపాల్‌రెడ్డి కూడా కోరుకుంటున్నారని చెప్పారు. భవిష్యత్‌లో ఏపీలో కూడా కాంగ్రెస్ బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నిర్ణయాలు పార్టీ విధానాలు, విశాలమైన ప్రయోజనాలతో ఉంటాయి తప్ప సంకుచితమైన మనస్తత్వంతో ఉండవని ఆయన అన్నారు.
ఓట్ చోరీతో పౌరుల హక్కులను కాలరాస్తున్నరు
ఓట్ల దొంగతనం (ఓట్ చోరీ) ద్వారా దేశంలో పౌరుల హక్కులను బీజేపీ కాలరాస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఓట్ల దొంగతనంపై స్పష్టమైన ఆధారాలతో దేశవ్యాప్తంగా ప్రజలకు వివరించారని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారని తెలిపారు. ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, ఇది భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని ఆయన అన్నారు.