బీఆర్ఎస్ నోట్ల కట్టలు కాంగ్రెస్ విజయాన్ని ఆపలేవు : భట్టి విక్రమార్క

బీఆర్ఎస్ నోట్ల కట్టలు కాంగ్రెస్ విజయాన్ని ఆపలేవు :  భట్టి విక్రమార్క
  • వ్యవసాయ పారిశ్రామికంగా మధిరను అభివృద్ధి చేస్తా

మధిర/ఎర్రుపాలెం, వెలుగు: బీఆర్ఎస్ నోట్ల కట్టల సంచులు కాంగ్రెస్ విజయాన్ని ఆపలేవని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్​ అభ్యర్థి  మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  భట్టి విజయాన్ని కాంక్షిస్తూ మధిర నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన బైక్ ర్యాలీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి  పాల్గొన్నారు. సత్తుపల్లి నుంచి ప్రారంభమై బైక్ ర్యాలీకి ఎర్రుపాలెం మండలం గుంటుపల్లి గోపారం గ్రామంలో మధిర నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.

వేలాది వాహనాలతో ర్యాలీ గుంటుపల్లి గోపారం నుంచి బనిగండ్లపాడు, ఎర్రుపాలెం, మీనవోలు, దెందుకూరు, మధిర, ఆత్కూరు క్రాస్ రోడ్డు, ఆత్కూరు, కలకోట సిరిపురం  గ్రామాల మీదుగా బోనకల్ క్రాస్ రోడ్డు చేరుకుంది. అక్కడి నుంచి వైరా నియోజకవర్గంలోకి ఈ బైక్ ర్యాలీ ప్రవేశించింది. మధిర పట్టణంలోని  వైఎస్ఆర్ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ ​ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాబలాన్ని నమ్ముకుంటే బీఆర్ఎస్ పాలకులు ఎన్నికల్లో నోట్ల కట్టల సంచులను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

పదేండ్లుగా ప్రజల సంపదను దోపిడీ చేసిన బీఆర్ఎస్ పాలకులు ఈ ఎన్నికల్లో డబ్బులను వెదజల్లి మరో ఐదేండ్లు దోచుకునేందుకు చూస్తున్నారని ఆరోపించారు. దీన్ని ప్రజలు గమనించి బీఆర్​ఎస్​కు గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మధిర నియోజకవర్గాన్ని వ్యవసాయ, పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఇక్కడ యువతకు ఉపాధికి పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారు. విద్య, వైద్య సంస్థలను ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకం కానున్న భట్టి  విక్రమార్కను అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. 

అత్యధిక మెజార్టీ ఉండాలి : పొంగులేటి

మధిర ప్రజలు భట్టిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం పాలైందన్నారు. తెలంగాణ ప్రజల ఆశలను అడియాసలు చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ ఎన్నికల్లో ఇంటికి పంపి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని  కోరారు. 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారమైన తర్వాత ఆరు గ్యారంటీల హామీల అమలుకు తొలి క్యాబినెట్ అక్కడే జరుగుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలుచేసి చూపిస్తామని చెప్పారు. ర్యాలీలో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 

బీఆర్​ఎస్ ​కొట్టుకు పోతది 

వైరా : ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ కొట్టుకుపోయి కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్​ నేతలు భట్టి, తుమ్మల, పొంగులేటి అన్నారు. ఆదివారం వైరాలోని పరుచూరి ఫంక్షన్​ హాల్​లో  వైరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోత్​ రాందాస్ నాయక్​ ఎన్నికల ప్రచారంలో భాగం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కేసీఆర్ సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది అన్నట్టుగా ఉచిత కరెంటు తాను ఇస్తున్నానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కరెంట్​ పేటెంట్​ హక్కు కాంగ్రెస్​ది అని తెలిపారు.