కాళేశ్వరానికి ఫడ్నవిస్ ఎందుకు?: భట్టి

కాళేశ్వరానికి ఫడ్నవిస్ ఎందుకు?: భట్టి

ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ తెలంగాణ ప్రజలను,దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని  కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహ బయటపెడతామని ఆయన అన్నారు. ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం15 శాతం ప్రాజెక్టు నిర్మాణానికే 50 వేల కోట్లు ఖర్చైతే మొత్తం ప్రాజెక్టు పూర్తికావడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి.? అని అన్నారు. నిర్మాణం కూడా పూర్తికానటువంటి ప్రాజెక్టు ను హడావిడిగా ప్రారంభిస్తూ రాష్ట్రానికి భారంగా మారుస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై కేసీఆర్  వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు అడ్డుపడి తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్లు రాకుండా అడ్డుకున్నది కేసీఆరే అని భట్టీ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టు కోసం ఏం త్యాగం చేసాడని మహరాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ని పిలిచారని కేసీఆర్ ను ప్రశ్నించారు భట్టి. తెలంగాణ ఖజానాపై ఆర్థికభారం పడేలా వ్యవహరించిన వ్యక్తి ఫడ్నవిస్ అని అన్నారు.

డీపీఆర్ ను ప్రజలకు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని కోరితే ఇంతవరకు పెట్టలేదని విమర్శించారు. విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా విశ్రాంత ఉద్యోగులతో మాట్లాడించడం సరికాదన్నారు భట్టీ.

ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అన్ని పార్టీలను పిలవకుండా హడావిడిగా ప్రారంభోత్సవం ఎందుకు చేస్తున్నారో నిజం చెప్పాలన్నారు. నిజాలు బయటపడతాయనే స్టేక్ హోల్డర్స్ ని ఆహ్వానించలేదని భట్టి విక్రమార్క అన్నారు.