కోడి ముదిరె..కల్లు పులిసిపాయె..ఆరేళ్లైనా ఇండ్లు రాకపాయె

కోడి ముదిరె..కల్లు పులిసిపాయె..ఆరేళ్లైనా ఇండ్లు రాకపాయె

గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు చూపిస్తానని మంత్రి తలసాని పారిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తే దావత్ చేసుకుందామని వరంగల్  ప్రజలు ఆరేళ్లుగా కోడి, కల్లు సీసాలతో ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆరేళ్లయినా డబుల్ బెడ్రూం ఇళ్లు రాకపాయే..కోడి ముదిరిపాయె..కళ్లు పులిసి పాయే అని అన్నారు. లక్ష  ఇళ్ళు చూపించలేక నాగారం మున్సిపాలిటీ రాంపల్లి దగ్గర తమను వదిలి మంత్రి తలసాని పారిపోయాడన్నారు.

జీహెచ్ఎంసీలో లక్ష బెడ్రూం ఇళ్ళు నిర్మిస్తామన్న కేసీఆర్, కేటీఆర్, తలసాని అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలను ప్లే చేసి మీడియా కు చూపించారు భట్టి. తలసాని చెప్పిన లెక్క ప్రకారం ఐదు నియోజకవర్గాల్లోని 3,428 ఇళ్ళు మాత్రమే చూపించారన్నారు. గ్రేటర్ లో స్థలం లేకపోతే.. మియాపూర్ లో ఉన్న 815ఎకరాల భూమిలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టాలన్నారు . పేదల అవసరాలను,  ఓట్లుగా మార్చుకోవటం టీఆర్ఎస్ కు అలవాటుగా మారిందన్నారు.

తుక్కుగూడ, నాగారం మున్సిపాలిటీలు గ్రేటర్ పరిధిలోకి రావన్న విషయం తలసానికి తెలియకపోవటం సిగ్గుచేటన్నారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ళ సంగతి మర్చిపోతుందన్నారు. గ్రేటర్ లోని ప్రతి నియోజకవర్గంలో 4వేల ఇళ్ళు కడ్తామని మాట తప్పారన్నారు. ఇళ్ళు కట్టడానికి సేకరించిన అంబేడ్కర్ నగర్ స్థలాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు.