పులి బయటికి రాగానే బోనులో బంధిస్తాం : భట్టి విక్రమార్క

పులి బయటికి రాగానే బోనులో బంధిస్తాం : భట్టి విక్రమార్క
  • పులి బయటికి రాగానే బోనులో బంధిస్తాం
  • కేసీఆర్‌‌పై కేటీఆర్‌‌ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్‌‌ 

మధిర, వెలుగు : ‘‘పులి బయటికి వస్తుందని చెబుతున్నారు. ఆ పులి నుంచి రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను ఎలా కాపాడాలో మాకు తెలుసు. ఆ పులి బయటకు రాగానే బోనులో బంధిస్తాం’’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మరో రెండు మూడ్రోజుల్లో పులి బయటకు వస్తుందని సీఎం కేసీఆర్‌‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌‌ చేసిన వ్యాఖ్యలకు భట్టి కౌంటర్‌‌ ఇచ్చారు. గురువారం మధిరలోని తన క్యాంపు ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌‌లకు ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు.

బడ్జెట్‌లో రూ.17 వేల కోట్లు కేటాయించినా దళిత బంధు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బీసీ బంధు పేరుతో బీసీలను, గృహలక్ష్మి పేరుతో పేదలను మోసం చేశారని మండిపడ్డారు. మోసపూరిత హామీలిచ్చే బీఆర్‌‌ఎస్‌ను నమ్మవద్దని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి, కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చే గ్యారంటీ కార్డును జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలని ప్రజలకు సూచించారు. పథకాల అమలుకు అధికారులు, నాయకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, కుల, మత, పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన తెలిపారు.