కామారెడ్డి ఆస్పత్రిలో భవానీపేట విద్యార్థులకు చికిత్స

కామారెడ్డి ఆస్పత్రిలో భవానీపేట విద్యార్థులకు చికిత్స
  • మధ్యాహ్న భోజనం నాణ్యత లేదని టీచర్లు, అధికారులపై తల్లిదండ్రుల ఆగ్రహం

కామారెడ్డి జిల్లా: మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన మాచారెడ్డి మండలం భవానీపేట జిల్లా పరిషత్  హైస్కూల్ కు  చెందిన 23 మంది  విద్యార్థులకు  కామారెడ్డిలోని జిల్లా  హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.  నిన్న స్కూల్ లో మధ్యాహ్న భోజనం  తిన్న తర్వాత 35 మంది విద్యార్థులకు  వాంతులు, విరోచనాలు అయ్యాయి. 

టీచర్లు  స్థానిక డాక్టర్లతో  స్కూల్ లోనే చికిత్స చేయించారు. కొందరు వెంటనే  కోగా 23 మందిని మెరుగైన చికిత్స కోసం  కామారెడ్డి జిల్లా  హాస్పిటల్ కు   తరలించారు. విద్యార్థుల  పరిస్థితి నిలకడగా  ఉందని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని టీచర్లు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజనంలో  కుళ్లిపోయిన, పాడైన  పదార్థాలు వాడడం వల్లే  విద్యార్థులు అస్వస్థతకు  గురయ్యారని ఆరోపించారు.

సర్కారీ స్కూళ్లలో చదువుకుంటున్న పేద విద్యార్థులంటే ఎవరికీ లెక్క లేకుండా పోయిందని.. టీచర్లు, అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రుల వాగ్వాదానికి దిగారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత ఏర్పడగా.. పోలీసులు.. ఆస్పత్రి సిబ్బంది సర్ది చెప్పారు.