వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న అనుబంధ భీమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం సుమారు 1.50లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీంతో అర్ధరాత్రి వరకు దర్శనాలు కొనసాగాయి. మేడారం జాతరకు వెళ్లే ముందు రాజన్న ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు సుమారు 10 వేల కోడెల మొక్కులు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈవో ఎల్.రమాదేవి ఏర్పాట్లను పరిశీలించారు.
తప్పిపోయిన ఐదేళ్ల బాలుడు
భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ఓ కుటుంబంలో ఐదేళ్ల బాబు తప్పిపోయాడు. కుటుంబసభ్యులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల రంగంలోకి దిగి బాలుడిని వెతికి కుటుంబసభ్యులకు అప్పగించారు.
