Telangana Tour : నీళ్లపై రెయిన్ బో.. భీముని పాదం జలపాతం

Telangana Tour : నీళ్లపై రెయిన్ బో.. భీముని పాదం జలపాతం

వాన వెలిసిన తర్వాత ఆకాశంలో రెయిన్ బో (ఇంద్ర ధనస్సు) కనిపించగానే ఎంతో థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇంద్ర ధనస్సు మామూలుగా అయితే ఆకాశంలోనే కనిపిస్తుంది. కానీ, ఇక్కడ మాత్రం నీళ్లపై రెయిన్ బో చూడొచ్చు. సూర్యోదయం, సూర్యాస్తమయం టైంలో సూర్యకిరణాలు నీళ్ల మీద పడి, నేలకి వంగిన ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యం భీమునిపాదంలో తప్ప మరెక్కడా కనిపించదు.

భీముమునిపాదం (భీముని అడుగు) అని పిలిచే ఈ జలపాతం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం ఊళ్లో ఉంది. పంచపాండవుల్లో ఒకడైన భీముని పేరు మీదుగా ఈ వాటర్ ఫాల్ కి ఆ పేరు వచ్చింది. డెబ్బై అడుగుల ఎత్తు నుంచి నీళ్ల కిందఉన్న గుంతలో పడతాయి. వర్షాకాలంలో ఈ జలపాతం టూరిస్టులతో కళకళలాడుతూ ఉంటుంది.

ఇక్కడికి దగ్గర్లో ఉన్న పది కిలోమీటర్ల పొడవైన గుహ అదనపు అట్రాక్షన్. వాటర్ఫల్కి వెళ్లే తోవంతా పచ్చని చెట్లు, చిన్న పిల్ల కాల్వలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. జలపాతం దగ్గర్లో ఉన్న శివుడు, నాగదేవత విగ్రహాలకు టూరిస్ట్ లు పూజలు చేస్తుంటారు. చాలామంది ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి పిక్నిక్కి వస్తుంటారు. 

ఇలా వెళ్లాలి..

వరంగల్ నుంచి భీమునిపాదం 55 కిలోమీటర్లు. భూపతిపేట దగ్గర ఎడమవైపు మళ్లి, చిన్న ఎల్లాపురం మీదుగా భీముని పాదం చేరుకోవచ్చు. ఖమ్మం నుంచి అయితే 88 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయాలి. హైదరాబాద్ నుంచి భీమునిపాదానికి వెళ్లాలంటే మాత్రం 200 కిలోమీటర్ల జర్నీ చేయాల్సి ఉంటుంది.