గంగానందనుడైన భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అతడు మాటకు కట్టుబడటానికి, నిగ్రహానికి మారు పేరు. పరశురాముడి వద్ద దీక్షతో, క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసి, గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు. తన తండ్రి కోసం తాను వివాహం చేసుకోనని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. మాటకు కట్టుబడి ఉండటం తల్లి అయిన గంగమ్మ నుండి అలవడి ఉంటుంది. గంగాదేవి శంతనుడిని వివాహం చేసుకునే సమయంలో, ‘నేను చేసే పనికి నువ్వు అడ్డుపడిన మరుక్షణం నేను వెళ్లిపోతాను. అందుకు అంగీకారమైతేనే వివాహమాడతాను’ అని పలికింది. శంతనుడు అందుకు అంగీకరించాడు. గంగాదేవి తను ప్రసవించిన బిడ్డలను గంగలో విడిచింది. అలా ఏడుగురు బిడ్డలను విడిచింది. శంతనుడు మారు పలుకలేదు. ఎనిమిదో బిడ్డను గంగలో వదులుతుండగా శంతనుడు అడ్డుపడ్డాడు. మాట ప్రకారం శంతనుడిని విడిచి వెళ్లిపోయింది గంగ. అలా తల్లి నుండి వారసత్వంగా ‘మాటకు కట్టుబడి ఉండటం’ భీష్ముడికి పుట్టుకతోనే వచ్చి ఉంటుంది.
కొంతకాలం తరువాత శంతనుడు యమునా నదీ తీరంలో సత్యవతి అనే యోజనగంధిని చూశాడు. శంతనుడు ఆమెను మోహించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ‘నా తండ్రి అనుమతిస్తేనే మన వివాహం జరుగుతుంది’ అని చెప్పింది సత్యవతి. శంతనుడు మత్స్యరాజు వద్దకు వెళ్లి తన మనసులోని మాటను వివరించాడు. అందుకు సత్యవతి తండ్రి, ‘నా కుమార్తెకు పుట్టబోయే కుమారుడిని హస్తినాపుర సింహాసనానికి రాజును చేస్తానని మాట ఇస్తే వివాహానికి అంగీకరిస్తాను’ అని షరతు విధించాడు.
తన కుమారుడు దేవవ్రతుడి గురించి ఆలోచించి శంతనుడు మౌనం వహించాడు. ఆనాటి నుండి శంతనుడు దిగులుగా ఉంటున్నాడు. అందుకు కారణం తెలుసుకున్నాడు దేవవ్రతుడు. తన తండ్రి కోసం తాను సింహాసనం వదులుకుంటానని మత్స్యరాజుకు మాట ఇచ్చాడు. వారికి సందేహం కలగకుండా ఉండటం కోసం, తాను జీవితకాలం బ్రహ్మచారిగానే ఉండిపోతానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. తన తండ్రికి సత్యవతితో వివాహం జరిగింది.
దేవవ్రతుడు చేసిన ప్రతిజ్ఞకు ఆశ్చర్యపడిన దేవతలు ఆయనకు భీష్ముడు అని పేరు పెట్టారు. విషయం తెలుసుకున్న శంతనుడు తన కుమారునికి స్వచ్ఛంద మరణం ప్రసాదించాడు. అంటే భీష్ముడు తాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరణించే వరం ఇచ్చాడు. అలా భీష్ముడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. సత్యవతికి పుట్టిన సంతానం మరణించడంతో రాజ్యాన్ని నిలబెట్టడం కోసం సింహాసనం అధిరోహించమని సత్యవతి కోరినప్పటికీ, చిరునవ్వుతో త్రోసిపుచ్చాడు భీష్ముడు.
ఎంతో శక్తిమంతుడైన భీష్ముడికి రాజ్య కాంక్ష లేదు. వంశ రక్షకుడిగా ఉంటూ, రాజ్య పరిపాలన సాగించాడు. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో శిఖండి ఎదురుపడటంతో అస్త్ర సన్యాసం చేశాడు. అంపశయ్య మీద యాభై ఎనిమిది రోజులు ఉండి, ఉత్తరాయణం ప్రవేశించాక స్వచ్ఛందంగా ప్రాణాలు విడిచిన మహనీయుడు. సాక్షాత్తు శ్రీకృష్ణుని సమక్షంలో పాండవులకు ధర్మబోధ చేశాడు.
భీష్ముని నుంచి పట్టుదల, మాటకు కట్టుబడి ఉండటం, క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయటం వంటి లక్షణాలను అలవరచుకోవాలని మహాభారతం మనకు చెబుతోంది. పాండవులు సైతం ధర్మానికి కట్టుబడి జూదంలో పందెం ప్రకారం 14 సంవత్సరాలు అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తి చేసి వచ్చాక కూడా, తమ రాజ్యభాగాన్ని తమకు ఇవ్వమని రాయబారం పంపారే కానీ, కౌరవుల మీదకు దాడికి వెళ్లలేదు. ఇది ద్వాపర యుగం నాటి మాట.
త్రేతా యుగంలోకి తరచి చూస్తే..
దశరథ మహారాజు పెద్దకుమారుడు శ్రీరామచంద్రుడు. చిన్నతనం నుంచి గురువులైన విశ్వామిత్రుని వద్ద క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. తండ్రి దశరథుడు నలుగురు పిల్లలకు మంచి మంచి కథలు చెబుతూ సద్గుణ సంపన్నులుగా తీర్చిదిద్దాడు. సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయడానికి సుముహూర్తం నిశ్చయించాడు దశరథుడు. తెల్లవారితే పట్టాభిషేకం. అంతలోనే కైకేయి రాముడిని పిలిచి, వనవాసానికి వెళ్లమని, ఇది తండ్రి ఆజ్ఞ అని చెప్పింది. తక్షణమే రాముడు నార వస్త్రాలు ధరించి, అడవులకు బయలుదేరాడు. వెనుకకు రమ్మని ఎందరు ఎన్నివిధాల అడిగినా, ‘ఈ రాముడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. సత్యాన్ని అతిక్రమించడు. తండ్రి గారి ఆజ్ఞకు లోబడి ఉంటాడు’ అని పలికాడే కాని, సింహాసనం అధిష్టించడానికి సుముఖత చూపలేదు. సత్యానికి, ఇచ్చిన మాట మీద నిలబడటం.. వంటి గుణాలకు ప్రాధాన్యత ఇచ్చిన మహనీయులు వీరు.
- డా. పురాణపండ వైజయంతి
