భోగ భాగ్యాల భోగి

భోగ భాగ్యాల భోగి

సంక్రాంతికి ఒక రోజు ముందు వచ్చే భోగి పండుగకు మన సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.  ఇంటికి భోగభాగ్యాలను ఆహ్వానించే ‘భోగి’ గురించి చెప్పాలంటే..నలుగు స్నానం నుంచి మొదలుపెట్టి భోగి పళ్లు, భోగి మంటలు, బొమ్మల కొలువు వరకు.. ఇలా  చాలా విశేషాలు ఉన్నాయి.


రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఇంటికిచేరే రోజు. రైతులతోపాటు అందరి ముఖాల్లో నవ్వులు పూసే రోజు. భోగి అంటే ‘తొలినాడు’ అని ఒక అర్థం ఉంది. కొత్త సంవత్సరంలో పండుగలు భోగితోనే మొదలవుతాయి. ఈ రోజు ఇంటి ముందు భోగి మంట వేస్తే ఇంట్లోని చెడును తొలగించుకున్నట్టే అని జానపదులు నమ్ముతారు.

పురాణాల్లో..

భోగి పండుగ వెనుక కొన్ని పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నెలంతా విష్ణుమూర్తి దేవాలయాల్లో ధనుర్మాసోత్సవాలు జరుగుతాయి. దీనికీ, భోగి పండుగకు సంబంధం ఉంది. విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవి. ఆమెకు పెళ్లి చేయాలనుకుంటాడు విష్ణుచిత్తుడు. అయితే ‘‘నేను శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాయకుడిని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోన’’ని తండ్రితో చెప్పిందామె. ఈ కోరిక తీరడం కోసం ధనుర్మాస వ్రతం చేసి, నెల రోజులపాటు పొంగలి మాత్రమే తిన్నదట! అదే సమయంలో రచించిన కృతులను స్వామికి అర్పించింది. వ్రతం పూర్తవగానే స్వామి ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని, శ్రీరంగం రమ్మని ఆదేశిస్తాడు. ఆమెకు సమస్త భోగాలను సమకూరుస్తానని వరం ఇస్తాడు. విష్ణుచిత్తుడు ప్రజలందరి సమక్షంలో వారి వివాహం జరిపిస్తాడు. వివాహం పూర్తికాగానే గోదాదేవి గర్భాలయంలోకి వెళ్లి, స్వామివారి పక్కన కూర్చొని, స్వామివారిలో ఐక్యమవుతుంది. ఈ తంతు జరిగిన రోజు భోగి. గోదాదేవిలాగే అందరికీ భోగభాగ్యాలు ఇచ్చే రోజు కాబట్టి, ఇది భోగి పండుగ అయ్యిందని ఒక కథ ప్రచారంలో ఉంది.

లౌకిక రూపం

పురాణాల నుంచి పుట్టిన పండుగలైనప్పటికీ, వాటికి ఒక సైంటిఫిక్​ కోణం ఉండటం మన కల్చర్​ గొప్పదనం. భోగి పండుగ రోజు సూర్యోదయానికి ముందే ఇళ్ల ముందు భోగి మంటలు వేస్తారు. ఆవు పేడతో చేసిన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల నుంచి వచ్చిన కలప, తాటాకులు, పంటలు కోసిన తర్వాత వచ్చిన గడ్డి వేసి భోగి మంటలు వేస్తారు. ఇంట్లోని పాత వస్తువుల్ని కూడా ఆ  మంటల్లో వేస్తుంటారు. ఇంట్లో అవసరంలేని వస్తువుల్ని బయటపడేసినట్టుగానే, మనలోని చెడు ఆలోచనల్ని, బాధల్ని కూడా ఇలాగే చేయాలని దీని అంతరార్థం.

నలుగు స్నానం

భోగి రోజు ఆచరించాల్సిన మరో సంప్రదాయం నలుగుస్నానం. భోగి మంటలు అయిపోగానే, ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్ధన చేసుకోవాలి. తర్వాత కుంకుడు కాయ రసంతో స్నానం చేయాలి. రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా స్నానం చేస్తే ఒంటిపై ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి. శరీరం కొత్త తేజస్సును, శక్తిని పొందుతుంది.

భోగి పళ్లు

చాలామందికి భోగి అనగానే గుర్తొచ్చేది భోగి పళ్లు. పన్నెండేళ్లలోపు పిల్లల తలపై నుంచి పండ్లు పోయడం ఈ సంప్రదాయం. రేగి పండ్లు, జీడిపండ్లు, చెరుకు ముక్కలు, కొన్ని నాణేలు పిల్లల తలపై పోస్తారు. చాప లేదా దుప్పటిపై, తూర్పుకు అభిముఖంగా కూర్చోబెట్టి ఇలా చేయాలి. రేగి పండ్లను శ్రీమన్నారాయణ ప్రతిరూపంగా భావిస్తారు. వీటిని తలపై పోస్తే శ్రీ లక్ష్మీ నారాయణుల ఆశీస్సులు పిల్లలకు ఉంటాయని నమ్మకం. పురాణాల ప్రకారం శివుడికోసం నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తారు. అప్పుడు దేవతలు వాళ్ల తపస్సుకు మెచ్చి, నరనారాయణుల తలలపై బదరీ ఫలాలు కురిపించారని చెప్తారు. అందుకే, ఈ కార్యక్రమం పురాణకాలం నుంచి వస్తున్న ఆచారమని నమ్ముతారు. పన్నెండేళ్ల లోపు చిన్నారులకు మాత్రమే, అంటే యుక్త వయసులోకి రాని పిల్లలకు మాత్రమే ఇలా భోగిపండ్లు పోస్తారు.

బొమ్మల కొలువు

కొన్ని ప్రాంతాల్లో భోగి రోజు బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేస్తారు. సాయంత్రం పూట పిల్లలు ఇంట్లోని బొమ్మలన్నింటినీ ఒక చోట పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో భోగి రోజు రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొన్ని నీళ్లు పారించి తడి చేస్తారు. ఒక పంట పూర్తయ్యాక మరో పంట కోసం నీళ్లు పారించడాన్ని పులకేయడం అంటారు. అంటే ఇది ‘భోగి పులక’ అని అర్థం.

స్పెషల్‌ పులగం

ఈ రోజు ప్రత్యేకంగా ‘పులగం’ చేసుకుంటారు. ఇది ఆరోగ్యపరంగానూ మేలైనది. చలి నుంచి ఒంటికి వెచ్చదనాన్ని అందించే లక్షణం ఈ వంటలో ఉంది. పైగా జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. అందుకే చాలా మంది భోగి రోజు పులగం తప్పనిసరిగా తినాలంటారు. మనం తరచుగా వాడే కలగాపులగం అనే మాట దీని నుంచే వచ్చింది. భోగి రోజు లక్ష్మీదేవిని కూడా కొలుస్తారు. ధాన్యలక్ష్మికి కట్టు పొంగలి చేసి నైవేద్యం పెడతారు. రాగులు, జొన్నలు పండే ప్రాంతాల్లో వాటితో ప్రత్యేకంగా రొట్టెలు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. భోగిరోజు పెళ్లికాని అమ్మాయిలు పాలతో పొంగలి చేసి లక్ష్మీదేవికి ప్రసాదంగా పెడితే పెళ్లి అవుతుందని నమ్ముతారు.

సూపర్ ఫుడ్: అరిసెలు

అరిసెలు లేని సంక్రాంతి ఊహించుకోలేం. నువ్వుల అరిసెలు చూస్తేనే నోరూరుతుంది. నిజానికి నువ్వులు మన ఫుడ్‌‌లో భాగం అయితే చాలా వరకు హెల్త్‌‌ సమస్యలు రాకుండా ఉంటాయి. నువ్వుల్లో ఐరన్, జింక్, క్యాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌‌తో పాటు విటమిన్ ‘ఇ’ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే స్త్రీలకి ఐరన్ ఎక్కువగా ఉండే నువ్వులు, బెల్లం కలిపి తినటం మంచిదని చెబుతారు.  సంక్రాంతి స్పెషల్ గా నువ్వులు, బెల్లం వేసిన అరిసెలని తినాలని చెప్పేది కూడా అందుకే. బాడీలో ఐరన్ శాతం పెరగటానికి ఇంతకు మించిన ఫుడ్ లేదు.  నువ్వుల అరిసెల్లో ఉండే నల్ల నువ్వులు చెడు కొవ్వును తగ్గిస్తూ కేన్సర్ కణాలు మన బాడీలో చేరకుండా అడ్డుకుంటాయి.  బాడీలో ఉండే అలసట తగ్గిపోవటానికి, కొత్త శక్తి రావటానికి కావాల్సిన అన్ని విటమిన్స్‌‌ ఉన్న సూపర్ ఫుడ్ అరిసెలు. అందుకే అరిసెలను పండుగకు రెండు వారాల ముందే చేసుకుని, పండుగ అయిపోయాక మరో రెండు మూడు వారాల వరకూ తింటారు.