
వచ్చే వారం ‘ఆదిపురుష్’ సినిమాతో సోలోగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత జులైలో కొన్ని సినిమాలు ఉన్నా.. అందరి ఆసక్తి ఆగస్టులో రాబోయే సినిమాలపైనే ఉంది. అందుకు కారణం.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ స్టార్ హీరోల సినిమాలన్నీ పంద్రాగస్టు టార్గెట్‌గా వస్తుండటమే. వీకెండ్‌తో పాటు ఇండిపెండెన్స్ డే సెలవు కూడా కలిసొస్తుండడంతో ఆగస్టు 10, 11 తేదీలలో ఐదు క్రేజీ సినిమాలు థియేటర్స్ కు వస్తున్నాయి.
భోళా శంకర్ : చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవికి జంటగా తమన్నా, చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్టు మార్చి నెలలోనే ప్రకటించారు. దాంతో ప్రమోషన్‌లోనూ స్పీడు చూపిస్తున్నారు.చిరు లీక్స్ పేరుతో స్వయంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ.. రిలీజ్‌కు టైమ్ ఉంది కనుక త్వరలోనే అది కంప్లీట్ చేసేయొచ్చు. ఆరు నూరైనా ఆ రిలీజ్ డేట్‌కే రావాలని మెగాస్టార్ కూడా ఫిక్స్ అయ్యారు.
ఓ మై గాడ్ 2 : పదకొండేళ్ల క్రితం అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఓ మై గాడ్’. వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’కి ఇది ఒరిజినల్ వెర్షన్. ఇన్నేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ వస్తోంది. శివుడి పాత్రలో అక్షయ్ కనిపిస్తున్న ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అమిత్ రాయ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. రెండేళ్ల క్రితమే మొదలైన ఈ సినిమా.. ఫైనల్‌గా ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అయ్యింది. అయితే మరో రెండు హిందీ సినిమాలు వస్తున్నాయని తెలిసినా.. హడావుడిగా ఇప్పుడు రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. హిట్ మూవీకి సీక్వెల్ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.
యానిమల్ : రణ్‌బీర్‌కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న హై యాక్షన్ ఇంటెన్సిటీ మూవీ ‘యానిమల్’. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్. అనిల్ కపూర్, బాబీడియోల్, పరిణీతి చోప్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 11 రిలీజ్ అని ముందుగానే అనౌన్స్ చేసినప్పటికీ.. విడుదల వాయిదా పడుతుందనే ప్రచారం మొదలైంది. దీంతో అనుకున్న షెడ్యూల్ ప్రకారం అదే డేట్‌కి థియేటర్స్ కి వస్తాం అని క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆసక్తి రేపిన ఈ చిత్రం.. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
గదర్ 2 : పంద్రాగస్టు టార్గెట్‌గా ఆగస్టు 11న బాలీవుడ్ నుండి వస్తోన్న మరో సినిమా సన్నీడియోల్ నటించిన ‘గదర్ 2’. 2001లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’కు ఇది సీక్వెల్. అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, మనీష్ వాధ్వా, అర్జున్ ద్వివేది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిల్ శర్మ డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ పార్ట్ కథ ఎక్కడైతే ఆగిందో.. అక్కడి నుండి తిరిగి ఈ మూవీ కథ మొదలవబోతోంది. అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయిన సినిమా కావడంతో అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి.