
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ కోర్టుకెక్కగా..తాజాగా టికెట్ల రేట్ల పెంపు విషయంలోనూ వివాదం చెలరేగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భోళా శంకర్ మూవీ టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
భోళాశంకర్ టికెట్ రేట్లు పెంచాలని ఏపీ గవర్నమెంట్ ను మూవీ టీమ్ దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దరఖాస్తును ఏపీ ప్రభుత్వం తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. దరఖాస్తులో మరిన్ని విషయాలు సమర్పించాలని.. గవర్నమెంట్ మూవీ టీంను కోరిందట. దరఖాస్తుతో పాటుగా మరిన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలని సూచించిందట. ఈ దరఖాస్తును పూర్తిగా సమర్పిస్తేనే దాన్ని పరిశీలించి రేట్ల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
హై బడ్జెట్ మూవీస్ రిలీజ్ విషయంలో..గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం.. అదనపు వివరాలు కూడా సబ్మిట్ చేస్తేనే టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. రీసెంట్ గా చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్‌గా మంత్రులు, వైకాపా నాయకులు రియాక్ట్ అయ్యారు. దీంతో ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకోవడంతో ఇష్యూ పెద్దదిగా మారింది. దీని కారణంగానే భోళా శంకర్ సినిమా టికెట్ల రేట్లు పెంపుపై ఏపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని అటు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
భోళా శంకర్ సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.